ఇబ్రహీంపట్నం, మే 26 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అక్రమాలు జరిగిన్నట్లు తమకు ఫిర్యాదులందాయని, వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అక్రమాలపై ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. అలాగే పట్టణ ప్రగతిపై కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎజెండాలో లేని అంశాలను సొంతంగా తీర్మానాలు చేసుకొని పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన పలు రికార్డులను కూడా ఆయన సీజ్ చేసి తీసుకెళ్లారు. అదేవిధంగా ఇతర సమస్యలను కూడా కౌన్సిలర్లు, ప్రజలు అదనపు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో కౌన్సిలర్లు నీళ్ల భానుబాబు, బర్తాకి జగన్, అల్వాల జ్యోతి, కొండ్రు శ్రీలత, బర్ల మంగ, కసరమోని పద్మ, ముత్యాల ప్రసన్నలక్ష్మి, యాచారం సుజాత, జెర్కోని బాలరాజు తదితరులు పాల్గొన్నారు.