మంచాల, మే 23: ఎండాకాలం వచ్చిందంటే చాలు… భానుడి ప్రతాపానికి ప్రజలు దాహంతో అల్లాడిపోతుంటారు. మండే ఎండల్లో చల్లటి నీటి కోసం తహతహలాడుతుంటారు. డబ్బున్న వాళ్లు ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తుంటే… పేదలు, మధ్యతరగతి వారు మట్టితో తయా రు చేసిన కుండలను అధికంగా కొంటుంటారు. ఎండాకాలంలో చల్లటి నీటిని అందించే కుండలు పేదవాడి ఫ్రిజ్‌లుగా పేరొందాయి. ఫ్రిజ్ నీళ్లకంటే మట్టి కుండల్లోని నీరు ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తుండటంతో ఈ మధ్యకాలంలో వాటిని కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నా సరే వేసవిలో మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. మట్టితో తయారైన తాగునీటి కోసం కుండలనే కాకుండా మట్టితో తయారైన వంట పాత్రలను కూడా ఉపయోగిస్తున్నారు. స్టార్ హోటళ్లలోనూ మజ్జిగను మట్టి పాత్రల్లోనే తోడు పెట్టి వినియోగదారులకు అందిస్తున్నారు. అన్నం వండేందుకు, పాలను మరగబెట్టేందుకు కూ డా మట్టి పాత్రలనే అధికంగా వినియోగిస్తున్నారు. ప్రజల డిమాండ్ మేరకు కుమ్మరులు వివిధ రకాల మట్టి కుండలను తయారు చేస్తున్నారు. వీటిలో కుండలు, ట్యాప్ బిగించిన కుండలు, కూజాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవేకాకుండా అలంకరణకు సైతం రంగురంగుల వివిధ ఆకృతుల్లో ఉన్న కుండలు, మట్టిపాత్రలకు నేడు మంచి డిమాండ్ ఉన్నది.
మట్టి కుండతో పలు ప్రయోజనాలు
మట్టి కుండలో నీరు సహజ పద్ధతిలో చల్లబడుతుంది. మనం తినే ఆహారం శరీరంలో ఎక్కువ భాగం ఆమ్లంగా మారి టాక్సిన్ను సృష్టిస్తుంది. బంకమట్టితో తయారయ్యే కుండ ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి శరీరంలో గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులు రాకుం డా సహకరిస్తుంది. అంతేకాకుండా నీటిలోని ఖనిజాలు, పోషకాల ను మట్టి కుండ చెక్కు చెదరనివ్వదు. వేసవిలో మట్టి కుండలోని నీరు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. వడ దెబ్బ నుంచి కూడా ఉపశమనం పొందుతాం.
కుండల తయారీ ఇలా..
కుండల తయారీలో కుమ్మరులు ముందుగా చెరువులు, కుంటల నుంచి ఒండ్రుమట్టిని తీసుకొచ్చి, దానిని జల్లెడ పడుతారు. చిన్న, చిన్న గులకరాళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించి ఆ మట్టిని నీటితో తడిపి బాగా కాళ్లతో తొక్కుతారు. మెత్తగా మారిన తర్వాత రెండురోజుల పాటు వస్త్రం కప్పి ఉంచి ఎప్పటికప్పుడు పై నుంచి నీటిని చల్లుతారు. ఆపై ముద్దలుగా చేసి సారెపై ఉంచి వారి కళానైపుణ్యంతో వివిధ ఆకృతుల్లో మట్టికుండలను తయారు చేస్తారు. వాటిని ఆరబెట్టి కొలిమిలో పొట్టువేసి కాల్చుతారు. రెండ్రోజులపాటు వాటిని చల్లార్చి, శుభ్రపర్చి మార్కెట్లో విక్రయించి లాభాలను పొందుతారు.
కుండల తయారీలో జాపాల కుమ్మరులు..
జిల్లాలోనే జాపాల గ్రామం మట్టి కుండల తయారీలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పేదోడి ఫ్రిజ్‌లుగా భావించే మట్టికుండలను వేసవి రాకముందే కుమ్మరులు సిద్ధం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో కుమ్మరి వృత్తి కనుమరుగైనా, ఈ గ్రామంలోని కుమ్మరులంతా ఏడాది పొడవునా ఈ వృత్తితోనే ఉపాధి పొందుతున్నారు. వేసవిలో మట్టికుండలకు మంచి డిమాండ్ ఉంటుండటంతో కుమ్మరులు ఈ కుండల తయారీలో బిజీగా ఉంటున్నారు. చిన్న, పెద్ద సైజుల్లో కుండలు, కూజాలను తయారు చేసి రంగారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ లాభాలను పొందుతున్నారు. ఆర్డర్లపైనా కుండలను రెడీ చేసి అనుకున్న సమయానికి వినియోగదారులకు అందిస్తున్నారు. మార్కెట్లో పది లీటర్ల కుండను రూ.50 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు.