కొందుర్గు, నవంబర్ 14 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటున్నారు. కొందుర్గు మండలంలోని చిన్న ఎల్కిచర్ల గ్రామం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే రూ. 60లక్షలకుపైగా ఖర్చు చేశారు. ప్రతి రోజూ చెత్త సేకరణతో గ్రామ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. రాత్రి వేళలో విద్యుత్ కాంతులతో మెరుస్తున్నది. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించడం వల్లన మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి కొత్త రూపు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల రూపురేఖలు మొత్తం మారిపోతున్నాయి. ప్రతి రోజూ పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దారు. గ్రామంలో మొత్తం 220 కుటుంబాలు ఉండగా, 11వందల మంది జనాభా ఉన్నారు. ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15లక్షలతో సీసీ రోడ్లు, జడ్పీటీసీ నిధులు రూ.2లక్షల 50వేలతో అంతర్గత మురుగు కాలువల నిర్మాణం పనులు చేపట్టారు. అంతర్గత మురుగు కాలువలు, సీసీ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. గ్రామంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది.
రూ.9లక్షల 68వేలతో గ్రామంలో అంతర్గత మురుగు కాలువల నిర్మాణం
రూ.21లక్షల 56వేలతో సీసీ రోడ్ల ఏర్పాటు
రూ.లక్షా 55వేలతో డంపింగ్ యార్డు ఏర్పాటు
రూ.6లక్షల 52వేలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు
రూ.6లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు.
రూ.12లక్షల 60వేలతో వైకుంఠధామం ఏర్పాటు.
రూ.5లక్షలతో గ్రామంలో కల్వర్టులు, గుంతల్లో మొరం వేయుట.
ఇప్పటి వరకు గ్రామంలో 15వేల మొక్కలు పెంపకం.
గ్రామాభివృద్ధే లక్ష్యం..
నేను సర్పంచ్ అయిన తరువాత గ్రామంలో అనేక నూతన పనులు చేపట్టాం. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి పైసాను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నాం. గ్రామంలో దాదాపు సీసీ రోడ్లు, అంతర్గత మురుగుకాలువల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. మరిన్ని నిధులు వస్తే వంద శాతం పనులు పూర్తి చేస్తాను. ప్రతి రోజు గ్రామంలో పారిశుధ్య పనులు చేస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చేదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
సమస్యలను పరిష్కరిస్తున్నాం..
గ్రామంలో ఇదివరకు ఉన్న గ్రామ పంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. ప్రభుత్వం మా గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ అధికారులు సూచించిన ప్రతి పనులు గ్రామంలో చేపడుతున్నాం. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం. గ్రామస్తుల సహకారం బాగుంది.
-మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి, చిన్న ఎల్కిచర్ల