తాండూరు రూరల్, మే 11 : తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ క్రీడలకు విశేష స్పందన లభిస్తున్నది. జిల్లాలో 11 కేంద్రాల్లో క్రీడలను నిర్వహిస్తున్నారు. 300 మంది విద్యార్థినీవిద్యార్థులు పలు క్రీడల్లో భాగస్వాములవుతున్నారు. దోమ మండలంలోని దిర్సమ్పల్లిలో ఖోఖో, తాండూరు మండలంలోని మల్కాపూర్‌లో త్వైకాండో, తులసి గార్డెన్ సాయిపూర్లో త్వైక్వాండో, వికారాబాద్‌లోని నాగార్జున్ స్కూల్లో ఖోఖో, ప్రభుత్వ బాలికల హైస్కూల్లో కరాటే, సిద్దిలూరులో వాలీబాల్, తాండూరులోని వేధిక్విష్టి స్కూల్లో వాలీబాల్, పూడూరులోని పెద్దఉమ్మెంతల్లో కబడ్డీ, పరిగిలో ఖోఖో, క్రికెట్‌ను ఆయా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ, యువకుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ క్రీడలు తోడ్పాటును అందిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మొదటి షిప్టులో నిర్వహిస్తుండగా, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు రెండో షిప్టు క్రీడలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటూ తన నైపుణ్యానికి పదును పెడుతున్నారు. తాండూరులో రెండు కేంద్రాల్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని మల్కాపూర్, పట్టణంలోని వేధిక్విష్ట హైస్కూల్లో విద్యార్థులు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వికారాబాద్‌లో కిక్రెట్, కబడ్డీ, ఖోఖో క్రీడలు నిర్వహిస్తున్నారు. పరిగిలో పలు రకాల క్రీడలను నిర్వహిస్తున్నారు. పీఈటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు.
సమ్మర్ క్యాంపును ఎంజాయ్ చేస్తున్నారు..
విద్యార్థులు సమ్మర్ క్యాంపును ఎంజాయ్ చేస్తున్నారు. వాలీబాల్ నేర్చుకునేందుకు విద్యార్థినీ, విద్యార్థులు వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పంపిస్తున్నారు. ఈ క్యాంపు కారణంగా విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం తెలుస్తున్నది.
– రాములు, వాలీబాల్ కోచ్, తాండూరు
విద్యార్థుల నుంచి మంచి స్పందన..
తెలంగాణ స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. విద్యార్థులు ఉత్సాహంగా పోటీ పడుతున్నారు. విద్యార్థులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మే 30 తేదీ లోపు విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేస్తాం.
– హన్మంతరావు, జిల్లా యువజన, క్రీడల అధికారి