చేవెళ్ల టౌన్, మే 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ధరణి రిజిస్ట్రేషన్లతో రైతుల ఇబ్బందులు తొలగిపోయాయి. చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో జోరుగా ధరణి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు వచ్చినవారికి త్వరితగతిన డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు అందజేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు సైతం ధరణి రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత రైతులు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. పెండింగ్ ఫైళ్లు సైతం పూర్తయ్యాయి. రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ కావడంతో అదే రోజు నేరుగా డాక్యుమెంట్లు, పాసుపుస్తకాలు అందజేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏండ్ల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కారం..
ధరిణి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఏండ్ల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కారమవడంతో పాటు దాదాపుగా మూడు వేలకు పైగా మ్యుటేషన్లు నమోదు కాగా, వాటిని కూడా పూర్తి చేసినట్లు తహసీల్దార్ అశోక్‌కుమార్ తెలిపారు. నిత్యం రైతులు తీసుకొచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించి సరైనవని నిర్ధారించిన వెంటనే రిజి స్ట్రేషన్లు చేస్తున్నామని తహసీల్దార్ వివరించారు.
నిత్యం 45 నుంచి 50 రిజిస్ట్రేషన్లు..
నిత్యం రైతులు రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకొని చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు. రోజుకు 45 నుంచి 50 రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో రైతులు సంతోషంగా వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ల ఇబ్బందులు తొలిగాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్లాట్ బుక్ తర్వాత నేరుగా రిజిస్ట్రేషన్లు..
రైతులు స్లాట్ బుక్ చేసుకున్న రోజు సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. వెంటనే డాక్యుమెంట్లను అందజేస్తున్నాం. ఏండ్ల తరబడి ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరించాం.
– అశోక్‌కుమార్, చేవెళ్ల తహసీల్దార్
ధరణితో రైతులకు ఎంతో మేలు..
ధరణి పోర్టల్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. గతంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు డబ్బులతో పాటు సమయం కూడా కలిసివస్తున్నది.
– రామగౌడ్, చేవెళ్ల