రంగారెడ్డి, మే 10, (నమస్తే తెలంగాణ) ;అసలే అంతంత మాత్రం స్పందన.. ఆపై పెట్రోల్, సిలిండర్ ధరలు తగ్గించాలంటూ ప్ల కార్డులతో ప్రజల నిరసన.. వెరసి జిల్లాలోకి మంగళవారం ప్రవేశించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మొక్కుబడిగా సాగింది. బండితో పాటు స్థానిక నేతలు ఎవ్వరూ లేకపోవడంతో కరీంనగర్ దండు మాత్రం హడావిడి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ లేనేలేడంటూ బండి సంజయ్ ప్రసంగిస్తుంటే ఉన్న కొద్దిమంది అవాక్కయ్యారు. పాదయాత్రలో స్థానిక ప్రజలు లేకపోవడంతో స్థానిక నాయకులు నానావస్థలు పడుతూ సమీప గ్రామాల నుంచి కూలీలకు రూ.300 నుంచి 500 ఇచ్చి యాత్రకు తీసుకు రాగా వారంతా అరగంట వ్యవధిలోనే వెనుదిరిగారు. కాకునూరు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఖాళీ కుర్చీలు తప్ప, జనాలు పెద్దగా కన్పించలేదు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు జిల్లాలో స్పందన కరువైంది. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలం తొమ్మిదిరేకుల, కక్కనూరు, కేశంపేట మండలాల్లో నిర్వహించిన బండి సంజయ్ పాదయాత్రకు స్థానిక ప్రజల నుంచి మద్దతు లభించలేదు. ఉదయం పాదయాత్ర ప్రారంభించిన సమయానికి స్థానిక గ్రామాల ప్రజలు ఎవరూ రాకపోవడంతో పాదయాత్రను కొంతసేపు ఆలస్యం చేసి, తన వెంబడి కాన్వాయ్‌లో వచ్చిన కరీంనగర్ కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో చేరడంతో పాదయాత్ర షురూ చేయడం గమనార్హం.
అయితే బండి సంజయ్ పాదయాత్రలో స్థానిక ప్రజల కంటే కరీంనగర్ నేతలు, కార్యకర్తలు ఎక్కువగా కనిపించారు. పరువు పోతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక నేతలు కలిసి సమీప గ్రామాల నుంచి పాదయాత్రకు ట్రాక్టర్లలో ప్రజలను తరలించారు. పాదయాత్రకు వచ్చిన తలకొండపల్లి మండలానికి చెందిన ప్రజలకు ఒక్కొక్కరికి రూ.400-500 ఇచ్చి పాదయాత్రకు తీసుకువచ్చినట్లు పాదయాత్రకు వచ్చిన ప్రజలు నమస్తే తెలంగాణతో వెల్లడించారు. డబ్బులిచ్చి తీసుకువచ్చిన ప్రజలు కూడా గంటలోపు తిరిగి వెళ్లిపోవడంతో కరీంనగర్ బ్యాచ్‌తోనే బండి పాదయాత్ర కొనసాగించారు.
బండి ప్రసంగంలో అన్నీ అబద్ధాలే…
బండి సంజయ్ తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు. తొమ్మిదిరేకులలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ పాల్గొనలేదంటూ, సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ప్రజలంతా విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మద్దతు ధర, విద్యుత్తు సరఫరా, ధాన్యం కొనుగోలుపై మాట్లాడిన బండి ప్రసంగానికి రైతుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పది నిమిషాల్లోనే ప్రసంగం ముగించడం గమనార్హం.
అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేయగా.. ఆ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా స్పందించని బండి.. పాదయాత్రలో మద్దతు ధర మోదీ చెల్లిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయంతోపాటు పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలు షురూ కాగా రాష్ట్రంలో మాత్రం నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ బండి అసత్య ప్రచారం చేయడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ప్రసంగ సమయంలోనూ ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడం గమనార్హం.