షాబాద్, మే 9 : అధికారులు బాధ్యతాయుతంగా విధు లు నిర్వహిస్తూ, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం ప్ర భుత్వం అందిస్తున్న ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని, అందులో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. మండలం లో ఈ ఏడాది ఇప్పటికే రూ. 2.50 కోట్లతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టామని తెలిపారు. సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ లీకేజీలు ఉండటంతో నీరు వృథాగా పోతుందని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే బాగు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యుత్ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడూ గ్రామాల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించాలని కోరారు. ప్రజాప్రతినిధులు వివిధ సమస్యలపై ఫోన్ చేసినప్పుడు సంబంధిత అధికారులు స్పందించాలన్నారు. అనంతరం ఆయా శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నారెడ్డి, ఎంపీడీవో అనురాధ, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికిరణ్, ఎంఈవో శంకర్‌రాథోడ్, ఏవో వెంకటేశం, ఏఈలు నరేందర్, శారద, శ్రీదివ్య, డాక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, స్రవంతి, వరలక్ష్మి, ఇందిర పాల్గొన్నారు.