ఇబ్రహీపంట్నం, మే 9 : పట్టణ, గ్రామీణ ప్రగతిలో భాగంగా హరితహారంలో నాటిన మొక్కలు సత్ఫలితాలిస్తున్నాయి. మండు వేసవిలోనూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మండువేసవిలోనూ పచ్చదనం వెల్లువిరుస్తున్నది. హరితహారంలో లక్షా యాభైవేల మొక్కలను నాటారు. నిత్యం ట్యాంకర్లతో మొక్కలకు నీటిని పోస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని జేబీ వెంచర్లో హరితహారం నర్సరీలో మొక్కలను పెంచి 24వార్డుల్లో విరివిగా నాటారు. సాగర్హ్రదారిపైన శేరిగూడ నుంచి ఖానాపూర్ వరకు రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. గతంలో చేపట్టిన పట్టణ ప్రగతిలో నాటిన హరితహారం మొక్కలు ఫలితాలివ్వటంతో మరో లక్షాయాభై వేల మొక్కలను నర్సరీలో సిద్ధంగా ఉంచారు. వర్షాలు ప్రారంభం కాగానే ప్రతివార్డులో నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం, శేరిగూడ, సీతారాంపేట్, ఖానాపూర్ గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు వృక్షాలయ్యాయి. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో హరిత మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం మారింది.
పెరిగిన అటవీప్రాంతం..
ప్రభుత్వ భూమిలో మొక్కలను నాటడం వల్ల అటవీ ప్రాంతం పెరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని వెంచర్లో మున్సిపాలిటీకి ఇచ్చిన భూమిలో మొక్కలను పెంచారు. ఎకరం పొలం అడవిని తలపిస్తున్నది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ హరితహారంలో నియోజకవర్గంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఇంటింటికీ ఐదు నుంచి పది మొక్కలను అధికారులు పంపిణీ చేశారు.
నాటిన ప్రతి మొక్కకూ సంరక్షణ..
హరితహారంలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నాటిన ప్రతి మొక్కకూ అధికారులు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ప్రతి మొక్క ఏపుగా పెరుగడంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచింది.
నాగిరెడ్డిపల్లి నర్సరీ సూపర్
మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని నర్సరీ జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. ఇటీవల కలెక్టర్ నిఖిల నర్సరీని పరిశీలించి ప్రశంసించారు. మట్టి సేకరణ, ఎరువులతో పాటు బ్యాగుల్లో నింపడం, విత్తనాలు నాటడం, క్రమం తప్పకుండానీళ్లు పోయడం, కలుపును తొలగించడం, మొలకెత్తని వాటి స్థానంలో కొత్తగా విత్తనాలను నాటడం వంటి చర్యల వల్ల నర్సరీ నిండుగా కనిపిస్తుంది. నర్సరీ పక్కన ప్రైమరీ బెడ్లను ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. పంచాయతీ కార్యదర్శి రవీందర్‌తో పాటు వాచర్ చూపిన చొరవతో నర్సరీ ఆదర్శంగా నిలిచింది. నర్సరీలో గుల్మొహర్, ఫెల్టోఫాం, బురుగు, రోజ్‌వుడ్, టెకోమా, అకేషియా, వుడ్ ఆపిల్, రేన్ట్రీ, వెదురు, చైనాబాదంతో పాటు వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. వచ్చే హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా, ప్రతి ఇంటి దగ్గర ఆరేసి మొక్కల చొప్పున, కమ్యూనిటీ ప్లాంటేషన్, వైకుంఠధామం, ఎస్బీఎం షెడ్, ప్రభుత్వ స్థలాలు, పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించారు.