కొత్తూరు రూరల్, మే 8: ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తూ విద్యా వ్యవస్థ పటిష్టతకు, అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నది. అందులో భాగంగానే పాఠశాలల మరమ్మతులు, నూతన పాఠశాలల భవనాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వ్యవస్థ, మధ్యాహ్న భోజ నం వంటి మౌలిక వసతులను విద్యార్థులకు ప్రభు త్వం కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు దీటుగా విద్యా వ్యవస్థను పటిష్ణ పరుస్తున్నది. పది పరీక్షలు సమీపిస్తుండటంతో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.
పక్కాగా ప్రణాళిక
మే 23న ప్రారంభం కానున్న ఫైనల్ ఎగ్జామ్స్(వార్షిక పరీక్షల)కు ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికలను సిద్ధ్దం చేస్తున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా విద్యా బోధన చేస్తున్నారు. పది విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా ప్రతి రోజు ఒక సబ్జెక్ట్‌కు రెండున్నర గంటల సమయాన్ని కేటాయిస్తూ రివిజన్‌ను చేస్తున్నారు. రివిజన్లో విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేస్తున్నారు. ఉపాధ్యాయులు మోడల్ పేపర్స్, బిట్స్ పేపర్స్‌ను ఇచ్చి ఎప్పటికప్పుడూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ..
కొత్తూరు మండల పరిధిలోని కొత్తూరు, ఇన్ముల్‌నర్వ, సిద్దాపూర్, పెంజర్ల, గూడూరు, కేజీబీవీ, నందిగామ మండల పరిధిలోని నందిగామ, మామిడిపల్లి, చేగూరు, నర్సప్పగూడ, మేకగూడ గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. 2018-2019 విద్యా సంవత్సరానికి కొత్తూరు, నందిగామ మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ గూడూరు, కొత్తూరు కేజీబీవీ, జడ్పీహెచ్ఎస్ మేకగూడ వందకు వందశాతం ఉత్తీర్ణతను, జడ్పీహెచ్ఎస్ కొత్తూరు, పెంజర్ల, నందిగామ, చేగూరు, నర్సప్పగూడ పాఠశాలలు 95శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించాయి. 2019-2020, 2020-2021 విద్యా సంవత్సరానికిగాను కరోనా వల్ల ఎస్ఏ-1 మార్కులను బట్టి ప్రభుత్వం ఉత్తీర్ణతను ప్రకటించింది. ఈ ఏడాదికి కొత్తూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 265 మంది పది పరీక్షలను రాయనున్నారు.
భయాన్ని పోగొట్టే విధంగా..
పది పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. 6 రకాలుగా విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాము. పరీక్షల పట్ల విద్యార్థులకు ఉన్న భయాన్ని పోగొట్టేందుకు మోడల్ టెస్ట్‌లు, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలను నిర్వహించాం. విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. వార్షిక పరీక్షల సమయం వరకు రివిజన్ క్లాస్‌లు కొనసాగుతూనే ఉంటాయి.
– కృష్ణారెడ్డి, మండల విద్యాధికారి, కొత్తూరు
పరీక్షలంటే భయం లేదు
పదోతరగతి పరీక్షలంటే అందరూ భయపడుతుంటారు. కానీ మాకు పరీక్షలంటే ఎటువంటి భయంలేదు. అధ్యాపకులు పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనను కల్పించారు. మాకు పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్నలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని అం దించారు. -ఆసియా పర్విన్, విద్యార్థిని,కొత్తూరు.
10 జీపీఏ లక్ష్యం..
పదో తరగతి పరీక్షల్లో కచ్చితంగా 10 జీపీఏను సాధిస్తాను. ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి పాఠ్యాంశాన్ని అనుసరిస్తున్నాము. స్పెషల్ క్లాస్‌లలో ఉపాధ్యాయులు అడిగిన ప్రతి ప్రశ్నకు, ఎంతో ఓపికతో నివృత్తి చేస్తున్నారు. ఉపాధ్యాయులు మాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మంచి ఫలితాలను సాధిస్తాము.
-విశాల్ రాణా, విద్యార్థి, తిమ్మాపూర్