ఆదిబట్ల, మే 5 : అవకాశాలను వినియోగించుకుంటూ, కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సాధించాలని ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి మంగళ్‌పల్లిలోని భారత్ ఇనిస్టిట్యూషన్స్‌లో రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం ఇబ్రహీంపట్నం పోలీసులు ‘పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రెయినింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు అందుబాటులో ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు తీసిపోని విధంగా పోలీసులు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులతో పాటు పరీక్షలకు కావాల్సిన మెటీరియల్, మైదానంలో శారీరక శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. శిక్షణ కోసం 183 మంది అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోగా వారిలో 152 మంది గురువారం నాటి తరగతులకు హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ షమీర్, భారత్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ శంకర్, ఇన్స్పెక్టర్లు సైదులు, వెంకటేశ్వర్లు, లింగయ్య, శేఖర్, పీజేఆర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిథులు పాల్గొన్నారు.
ప్రైవేటులో వేలకు వేలు చెల్లించాలి
ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు వెళ్లాలంటే రూ.వేలకు వేలు చెల్లించాలి. ఇక్కడ వాటికి తీసిపోని విధంగా తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతుల అనంతరం మెటీరియల్ ఇస్తామంటున్నారు. మైదానంలో శారీరక శిక్షణ కూడా అందించడమనేది మా లాంటి గ్రామీణ, పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చాలా ఉపయోగం. దీన్ని సద్వినియోగంచేసుకుని ఉద్యోగం సాధిస్తా.
– ప్రసాద్, యాచారం, కానిస్టేబుల్ అభ్యర్థి
చాలా ఉపయోగకరంగా ఉంది
పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్అవుతున్న మాలాంటి గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు రాచకొండ పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులు చాలా ఉపయోగకరం. మా గ్రామాల నుంచి నగరానికి వెళ్లి శిక్షణ తీసుకోలేని పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయటం ద్వారా మాకు అందుబాటులో ఉంది. ప్రతి రోజూ తరగతులకు హాజరై పోలీస్ ఉద్యోగాన్ని సాధిస్తా.
– అనూష, ఆరుట్ల, కానిస్టేబుల్ అభ్యర్థి
ఇది మంచి అవకాశం
మాకు అందుబాటులో ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయటం ఉద్యోగం సాధించాలన్న తపన ఉన్న వారికి ఇదో మంచి అవకాశం. ఎంత చదివినా పోటీపరీక్షలకు సమయాన్ని సమన్వయం చేసుకోవటం చాలా కష్టం. అందుకే శిక్షణ అనేది అవసరం ఉంటుంది. ఇంతకు ముందు నోటిఫికేషన్ సమయంలో ఇక్కడే శిక్షణ తీసుకున్న వారు చాలా మంది ఉద్యోగాలు పొందటాన్ని చూశాం. చాలా సంతోషంగా ఉంది.
– అంబిక, మంచాల, కానిస్టేబుల్ అభ్యర్థి