రంగారెడ్డి, మే 3(నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవిలోనూ నిరంతర విద్యుత్ సరఫరా అవుతుంది. ఒకప్పుడు వేసవికాలం వస్తే చాలు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. రోజుకు నాలుగైదు గంటలు కరెంట్ సరఫరా అయితేనే గొప్పగా చెప్పుకునేవారు. వేసవిలో ఉక్కపోతతో ప్రజలు చాలా వరకు పొలాల వద్ద చెట్ల కిందనే గడపాల్సిన పరిస్థితి నెలకొనేది. కానీ ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలతో ఉక్కపోతలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండటంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వంటివి వాడుతూ ఇంటి నుంచి బయటకు రావడంలేదు.
గత పది, పదిహేను రోజులుగా 40 డిగ్రీలపైనే ఉష్టోగ్రతలు నమోదవుతున్నా…ఒక్కరోజు కూడా విద్యుత్ కోతలు విధించడంలేదు. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే అంతా అంధకారమేనన్న ఆంధ్రా పాలకుల మాయమాటలను పటాపంచలు చేస్తూ నేడు 24గంటలపాటు గృహ అవసరాలతోపాటు వ్యవసాయం, పరిశ్రమలకు కూడా కోతలు లేకుండా సరఫరా చేస్తుండటంతో ప్రముఖ పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలివస్తుండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అతికొద్ది రోజుల్లోనే నిరంతర కరెంట్ సరఫరాతో జిగేల్ అంటుంటే పక్క రాష్ర్టాల్లో మాత్రం విద్యుత్ కోతలతో ఆ రాష్ట్ర ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీష్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో గృహ అవసరాలకు, పరిశ్రమలకు విధిస్తున్న కరెంట్ కోతలతో సామాన్య ప్రజలతోపాటు పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పలు రాష్ర్టాల్లో చిన్న పరిశ్రమల నిర్వాహకులు సెలవులు ప్రకటించడం గమనార్హం.
వికారాబాద్ జిల్లాలో రోజుకు 5.78 మిలియన్ యూనిట్ల వినియోగం
పరిగి, మే 3 : ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. గతంలో వేసవికాలంలో విసనకర్రలు ప్రతి ఇంట్లో ఉండేవి. అప్పట్లో పేరుకే కరెంటు, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో 24 గంటలపాటు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నారు. రెప్పపాటు సమయం సైతం కరెంటు పోకుండా సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని నిలిబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. తద్వారా ఎండాకాలంలోనూ ప్రజలు ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లాకు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాల్లో కరెంటు కోతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు అక్కడ రోజుకు 7 గంటలు కరెంటు ఇవ్వడం గమనార్హం. పక్కనే గల తెలంగాణలోని గ్రామాల్లో కోతలులేని కరెంటు సరఫరాను చూసి తమకు ఇలా ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో 2,09,015 డొమెస్టిక్(గృహావసరాలు) కనెక్షన్లు, 24,379కమర్షియల్, 33,091 పరిశ్రమలు, 66,423 వ్యవసాయ, వీధిదీపాలకు సంబంధించి 2,711, నీటి సరఫరాకు సంబంధించి 2,997, ఇతర కనెక్షన్లు 1,865 ఉన్నాయి. వీటికిగాను జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 5.7 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగమవుతుంది. సాధారణ రోజుల్లో 4.5 నుంచి 5 మిలియన్ యూనిట్ల లోపే వినియోగం ఉండేది. వేసవికాలం కావడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. ఈనెల 2వ తేదీన జిల్లాలో 5.78 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం కాగా, వికారాబాద్ జిల్లా పరిధిలో గత ఆరున్నర ఏండ్లుగా అందుతున్న నిరంతర కరెంటుతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి ఎండల వేడిమి నుంచి ఉపశమనానికి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సైతం వాడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటిపాటునే ఉన్న వారు కరెంటు సరఫరా వల్ల కూలర్లు, ఏసీలతో ఉపశమనం పొందుతున్నారు.
కూలర్లు, ఏసీలకు పెరిగిన గిరాకీ..
ఎండల తీవ్రతతో ఓవైపు రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా.. వేడి నుంచి ఉపశమనం పొందటానికి ప్రజలు కూలర్లు, ఏసీలు వినియోగిస్తుండటంతో వాటి గిరాకీ సైతం పెరిగింది. నిరంతర కరెంటు సరఫరాతో కూలర్లు, ఏసీల వినియోగానికి వాటిని కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏసీలు, కూలర్లతోపాటు తక్కువ ధరకు లభించే కూలర్లు సైతం కొనుగోలు చేస్తుండటంతో ఈ వేసవిలో కూలర్ల విక్రేతల వ్యాపారం మూడు ఏసీలు, ఆరు కూలర్లు అనే విధంగా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇందుకు ప్రధాన కారణం నిరంతర కరెంటు సరఫరానే కావడం విశేషం. కోతలు లేని కరెంటు సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పలువురు పేర్కొంటున్నారు.
సీఎంది మంచి నిర్ణయం
కరెంట్ సరఫరా చేయడంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. తెలంగాణ వస్తే చీకటిగా మారుతుందని గతంలో ఆంధ్ర పాలకులు ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో కరెంట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాలు మనమందరం గమనిస్తూనే ఉన్నాం. కానీ నేడు దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరా చేయడం బాగుంది.
– పి.కుమార్, కుమ్మరిగూడ (షాబాద్)
నిరంతర విద్యుత్ సరఫరా సంతోషకరం
ప్రభుత్వం 24గంటల నిరంతర కరెంట్ సరఫరా చేయడం సంతోషకరం. గతంలో ఎండాకాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతతో తిప్పలు పడాల్సిన దుస్థితి ఉండేది. ఇప్పుడు మండుతున్న ఎండలకు బయటికి వెళ్లలేక నిరంతరం ఉంటున్న కరెంట్‌తో ఏసీలు, ఫ్యాన్ల గాలికి ఇంటి వద్దనే సేదతీరుతున్నాం.
– అవినాశ్‌కుమార్, సర్దార్‌నగర్(షాబాద్)
ఇంతకు ముందు ఎవరూ ఇయ్యలేదు
ఒకప్పుడు కరెంట్ నాలుగు గంటలు ఉంటే గొప్పగా చెప్పుకునేది. ఎండాకాలంలో కరెంట్ పోయిందంటే చాలు ఇండ్లలో ఉండాలంటే అనేక ఇబ్బందులు పడేవాళ్లం. పొలాల వద్ద చెట్ల గాలికి కొద్దిసేపు సేద తీరింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా చేశారు సీఎం కేసీఆర్.
– శ్రీశైలంగౌడ్, మక్తగూడ(షాబాద్)
24గంటలు కరెంట్ అందించడం సంతోషకరం
గతంలో కరెంట్ లేక తిప్పలు పడేటోళ్లం. గతంలో కరెంట్ సరిగ్గా లేక ఎన్నో అవస్థలు పడ్డాం. తెలంగాణ వచ్చినంకా సీఎం కేసీఆర్ వ్యవసాయంతో పాటు ఇండ్లకు కూడా 24గంటల నిరంతర కరెంట్ అందించడం సంతోషంగా ఉన్నది. కరెంట్ నిత్యం ఉండటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, కూలర్లు వాడుకుంటున్నాం.
– సయ్యద్ జాన్, సర్దార్‌నగర్(షాబాద్)
జనం హాయిగా నిద్రపోతున్నారు..
గతంలో ఎండాకాలంలో తరచుగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఎంతో ఇబ్బంది పడేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత, అసలు విద్యుత్ కోతలే లేవు. నిరంతరాయ విద్యుత్ సరఫరాతో మంచి ఎండాకాలంలోనూ హాయిగా జనం నిద్రపోతున్నారు. నిరంతరాయ విద్యుత్ వలన మండిపోతున్న ఎండల్లోనూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో సేదతీరుతున్నాం. ఇతర రాష్ర్టాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు తల్లడిల్లుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ప్రజలకు ఎలాంటి విద్యుత్ కోతలు లేకపోవటం వలన హాయిగా ఉంటున్నారు.
–శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం