పరిగి, మే 2: వికారాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూముల సర్వేను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆమె 117 అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ భూముల సర్వే పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని, గ్రామాలవారీగా సర్వే పూర్తిచేసి ఆన్లైన్లో రోజువారీగా అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. భూముల సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండు రోజుల్లో వీఆర్ఏ, వీఆర్వోల ద్వారా నోటీసులను అందించాలన్నారు. సర్వే చేయడం లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సర్వేయర్లను ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో తాండూరు, వికారాబాద్ ఆర్డీవోలు అశోక్‌కుమార్, విజయకుమారి, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాంరెడ్డి, కలెక్టరేట్ ఏవో హరిత, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ తరలింపును అరికట్టాలి
ఇసుక అక్రమ తరలింపును అరికట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇసుక అక్ర మ తరలింపును అరికట్టడంపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి ఆమె సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండు పడకల ఇండ్ల కు, ప్రభుత్వం చేపట్టే వివిధ పనులకు అనుమతులు ఉన్న ఆరు ప్రాంతాల్లోనే ఇసుక తవ్వకాలకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో ఆరు చెక్‌పోస్టులు, రెండు ఫ్లయింగ్ స్కా డ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీ సు, మైనింగ్ శాఖల నుంచి ఆరుగురు చొప్పున కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తున్నారని, అలాంటి వాటిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వాహనాలకు నంబర్ లేకుండా ఇసుకను తరలిస్తున్నారని పలువురు తహసీల్దార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అలాంటి వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు తహసీల్దార్లు పాల్గొన్నారు.