రంగారెడ్డి, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నది. అన్నదాతలు లాభాలను ఆర్జించాలన్న సదుద్దేశంతో కొత్త రకం విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నది. ఈ విత్తనాల సాగుతో పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అంతేకాకుండా పంటకు సోకే చీడపీడలు, అకాల వర్షాలు, కూలీల కొరతను అధిగమించేందుకు పత్తి సాగులో సింగిల్ పిక్ పత్తి సాగుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల మండల పరిధిలో ప్రయోగాత్మకంగా 1000 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి సాగు చేయాలని నిర్ణయించింది. సాధారణ పత్తి ఎకరానికి 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, సింగిల్ పిక్ పత్తి 7-9 క్వింటాళ్ల మేర దిగుబడి రానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు.
దీంతో సాధారణ పత్తికంటే దాదాపు మూడు క్వింటాళ్ల పత్తి అధికంగా దిగుబడి రానున్నది. ఈ వానకాలం సీజన్లో కొత్త, పాత రకం విత్తనాలను కలుపుకొని జిల్లావ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కొత్త రకం విత్తన సాగును ప్రోత్సహించేందుకు ఇప్పటికే రైతులకు అవగాహన కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు.
పత్తి సాగులో కొత్త రకం విత్తనాలతో సాగు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సింగిల్ పిక్ పత్తి సాగుకు ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ఈ వానకాలం సీజన్ నుంచి సింగిల్ పిక్ పత్తిని సాగు చేసేలా సర్కార్ ప్రణాళికలు చేపట్టింది. ప్రతి ఏటా పత్తి ఏరేందుకు కూలీల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో, రెండు, మూడు సార్లు పత్తి దిగుబడి వస్తుంది కాబట్టి అకాల వర్షాలతో పంట నాశనం అవుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని మాడ్గుల, ఆమనగల్లు, షాబాద్ తదితర మండలాల్లో అధిక మొత్తంలో పత్తి సాగవుతున్నది.
పత్తి సాగు చేస్తున్న రైతులు ప్రతి ఏటా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కూలీలపై ఆధారపడాల్సి వస్తున్నది. జిల్లాలోని మాడ్గుల, షాబాద్ మండలాలకు కర్నూల్ నుంచి కూలీలు వస్తున్నారు. ఒకవేళ కూలీలు రాని పరిస్థితులు ఎదురైతే పంటను చేనులోనే రైతులు వదిలేసుకుంటున్న దయనీయ పరిస్థితి నెలకొంటున్నది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే విధంగా సింగిల్ పిక్ పత్తిని సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీనికి సంబంధించి జిల్లాలోని రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు.
పత్తి సాగుకు ప్రణాళికలు..
జిల్లావ్యాప్తంగా 1000 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తిని సాగు చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. సంబంధిత వెయ్యి ఎకరాలు కూడా జిల్లాలోని మాడ్గుల మండలంలోనే సాగు చేసేందుకు నిర్ణయించారు. సాధారణ పత్తి రకం కన్నా సింగిల్ పిక్ పత్తి సాగుతో అధిక దిగుబడి రానున్నది. ఏ నేలలోనైనా సాగు చేసేందుకు సింగిల్ పిక్ సాగుకు అనుకూలం. అంతేకాకుండా ఈ రకం పత్తికి పెట్టుబడి కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. సాధారణ పత్తి సాగుతో ఎకరానికి 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, సింగిల్ పిక్ పత్తి సాగుతో 7-9 క్వింటాళ్ల మేర దిగుబడి రానున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు. సాధారణ పత్తి రకం సాగుతో ఎకరాకు 7-12 వేల మేర మొక్కలుంటే, సింగిల్ పిక్ పత్తి రకంలో 25-30 వేల వరకు మొక్కలుండనున్నట్లు అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 3 లక్షల ఎకరాల్లో…
ప్రభుత్వ సూచనల మేరకు ఈ వానకాలం సీజన్లో భారీగా పత్తి పంటను సాగు చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆ దిశగా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయాధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పండించే పత్తికి దేశీయంగా, విదేశాల్లో చాలా డిమాండ్ ఉన్నది. ఎంత పత్తి పంటను సాగు చేసినా స్థానికంగానే ఆయా జిల్లాల్లోనే జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోలు చేస్తుండడంతోపాటు ప్రభుత్వం మద్దతు ధర కూడా అందిస్తున్నది. అంతేకాకుండా కరోనా ప్రభావం కారణంగా పత్తి అధిక మొత్తంలో సాగయ్యే బంగ్లాదేశ్, చైనా, బ్రెజిల్ దేశాల్లో పత్తి సాగు రికార్డు స్థాయిలో పడిపోవడంతో పత్తికి డిమాండ్ ఏర్పడింది.
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో పత్తికి నష్టం వాటిల్లిన దృష్ట్యా దిగుబడి భారీగా తగ్గిపోయింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వానకాలం సీజన్లో పత్తి సాగును గణనీయంగా పెంచనున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 3.79 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా, 1.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. అదేవిధంగా 2020 వానకాలం సీజన్లో ఆయా పంటలు కలిపి మొత్తం 4.71 లక్షల ఎకరాల్లో సాగుకాగా, పత్తి 2.70 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. అదేవిధంగా కంది పంట సాగును కూడా ఈ వానకాలం సీజన్లో లక్ష ఎకరాలకు పెంచేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను రూపొందించింది.
సింగిల్ పిక్ పత్తి సాగుతో అధిక దిగుబడి
సింగిల్ పిక్ పత్తి సాగుతో రైతులు అధిక లాభాలను ఆర్జించవచ్చు. పత్తి సాగులో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత సమస్య పూర్తిగా తీరనున్నది. సాధారణ రకం పత్తి సాగులో రెండు, మూడు సార్లు రావడంతో కూలీల సమస్య ఏర్పడుతోంది. అంతేకాకుండా సాధారణ పత్తి రకంతో పోలిస్తే సింగిల్ పిక్ సాగుతో అధిక దిగుబడి వస్తుంది.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి