మొయినాబాద్, ఏప్రిల్ 30: క్రికెట్లో టీ20 మ్యాచ్‌లు వచ్చిన తర్వాత పిల్లాడి నుంచి పెద్దల వరకూ ఆ ఆటపై క్రేజీ పెరిగిపోయింది. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సెలవులు వచ్చాయంటే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ యువకులు క్రికెట్ బ్యాట్లతో వాలిపోతుంటారు. యువతకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని కొందరు మైదానాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నగరంలో ఆట స్థలాలు లేకపోవడంతో నగర శివార్లకు క్రీడాకారులు వస్తున్నారు. డిమాండ్‌ను గమనించిన కొందరు రైతులు తమ పంట పొలాలను మైదానాలుగా మార్చి అద్దెకు ఇస్తున్నారు. నగరానికి చెందిన కొందరు భూములను లీజుకు తీసుకుని మైదానాలుగా తీర్చిదిద్ది, వాటిని క్రీడాకారులకు అద్దెకు ఇస్తున్నారు. మైదానాల వివరాలను ఆన్లైన్లో ఉంచడంతో బుక్ చేసుకుని పలువురు క్రీడాకారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు క్రికెట్ ఆడుతున్నారు. మైదానాల్లో క్రికెట్ ఆడేందుకు నిర్వాహకులు ఒక మ్యాచ్, ఒక రోజు లెక్కన డబ్బులను వసూలు చేస్తున్నారు.
మొయినాబాద్ మండలం హైదరాబాద్‌కు ఆనుకొని ఉండటంతో ఇక్కడ క్రికెట్ క్రీడామైదానాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు పట్టాదారులు మైదానాలుగా ఏర్పాటు చేసి ఇతరులకు లీజుకు ఇస్తున్నారు. వాటిని తీసుకున్న నిర్వాహకులు క్రీడాకారులకు అద్దెకు ఇస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో పదుల సంఖ్యలో క్రికెట్ మైదానాలు వెలిశాయి. వీకెండ్స్ వస్తే చాలు నగరం నుంచి క్రీడాకారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆన్లైన్లో క్రికెట్ మైదానాలను బుక్ చేసుకుని క్రికెట్ ఆడేందుకు తరలివస్తున్నారు. ఇందుకు నిర్వాహకులు ఒక మ్యాచ్, ఒక రోజు లెక్కన చార్జీలను వసూలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో మైదానంలో ఒక్కో ధరను నిర్ణయిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అదే వీకెండ్స్‌లో అయితే రూ.10 నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సిందే. సాధారణ రోజుల్లో సైతం ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆ మైదానాల్లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
లీజుకు మైదానాలు..
ఒక్క క్రికెట్ మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు నాలుగు ఎకరాల స్థలం అవసరం తోపాటు సుమారుగా రూ.50లక్షలు ఖర్చు అవుతుంది. కొందరు పట్టాదారు లు మైదానాలను ఏర్పాటు చేసి ఇతరులకు లీజుకు ఇస్తున్నారు. మైదానాలుగా తీర్చిదిద్ది నిర్వహణపై అవగాహన లేకపోవ డం.. రిస్క్ ఎందుకు అనుకునే వారు ఇతరులకు లీజుకు ఇస్తున్నారు. లీజుకు తీసుకున్న వారు ప్రతి నెలా పట్టాదారుడికి రూ.50నుంచి రూ.60వేలు అద్దె చెల్లిస్తున్నారు. కొందరు రైతులైతే కేవలం భూమిని మాత్రమే లీజుకు ఇచ్చి ప్రతినెలా రూ.25 వేల వరకు అద్దె తీసుకుంటున్నారు. మైదానాలతో ఇటు రైతుకు ఆదాయం రావడంతోపాటు క్రికెట్ మైదానాల(లీజుకు తీసుకున్న వారికి) నిర్వాహకులు కూడా ఆదాయాన్ని పొందుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న క్రికెట్ మైదానాల కంటే ఇవి విశాలంగా ఉండటంతో క్రీడాకారు లు అక్కడ ఆటలాడేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఔటర్ సమీపంలోనే అధికం…
నగరంలో క్రీడాకారులకు అనుకూలంగా మైదానాలు లేకపోవడంతో క్రీడలు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో క్రీడాకారుల ఆసక్తిని గుర్తించిన మండలానికి చెందిన కొందరు క్రికెట్ మైదానాలను ఏర్పాటు చేస్తున్నా రు. మండలం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం తో అధికంగా మైదానాలు వెలుస్తున్నాయి. క్రీడాకారులు నగరం నుంచి అర గంటలో మైదానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా 5-10 కిలోమీటర్ల దూరంలోనే మైదానాలున్నాయి. ఐటీ కారిడార్‌గా చెప్పుకునే గౌచ్చిబౌలికి కేవలం 10 కిలో మీటర్ల దూరమే. గౌచ్చిబౌలిలోని పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న మైదానాల్లో క్రికెట్ ఆడేందుకు వస్తున్నారు. వీకెండ్స్‌లో అయితే మండలంలోని అన్ని మైదానాలు క్రీడాకారులతో నిండిపోతాయి.
మండలంలో 30కి పైగా మైదానాలు…
పంట గిట్టుబాటు ధర రావడంలేదని కొంత మంది రైతులు వ్యవసాయ పొలాల్లో క్రికెట్ మైదానాలను ఏర్పాటు చేసి లీజుకు ఇస్తున్నారు. మొయినాబాద్ మండలంలో సుమారుగా 35 మైదానాలు న్నాయి. ఎన్కేపల్లిలో 12, అజీజ్‌నగర్‌లో 8, నాగిరెడ్డిగూడలో ఒకటి, మోత్కుపల్లిలో ఒకటి, హిమాయత్‌నగర్‌లో 4, బాకారంలో 5, నజీబ్నగర్లో ఒకటి, హిమాయత్‌నగర్‌లో 3 చొప్పున క్రికెట్ మైదానాలున్నాయి. ఇందులో నాగిరెడ్డిగూడలో, బాకారం, అజీజ్నగర్లలో ఏర్పాటు చేసిన మైదానాల్లో రాత్రి, పగలు కూడా క్రికెట్ ఆడేందుకు వీలుగా అన్ని సౌకర్యాలను నిర్వాహకులు కల్పించారు.
వరి పంటతో గిట్టుబాటు రాకపోవడంతో..
గతేడాది నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేసి రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.40వేలు నష్టం వచ్చింది. వ్యవసాయం చేయడం ద్వారా ఉపయోగంలేదని నాకున్న 8 ఎకరాల్లో రెండు క్రికెట్ మైదానాలను ఏర్పాటు చేశా. వాటి నిర్వహణ నాతో కాకపోవడంతో ఇతరులకు లీజ్‌కు ఇచ్చా. ఏడాదికి రెండు మైదానాలకు కలిపి రూ.10 నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. లీజుకు ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బందిలేదు.
– కొత్తపల్లి బీమేందర్ రెడ్డి, రైతు, ఎన్కేపల్లి, మొయినాబాద్
నగరంలో అనుకూలంగా ఉండవు..
హైదరాబాద్‌లో క్రికెట్ మైదానాలు ఉంటే ఒక్కో గ్రౌండ్లో ఐదారు టీంలు ఆడుతాయి. క్రికెట్ ఆడితే ఒక టీంలోని బాలు మరో టీంలోనికి వస్తుంటుంది. కొన్నిసార్లు గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మైదానాలు తక్కువగా.. ఆడేవారు ఎక్కువగా ఉంటారు. నగరానికి మొయినాబాద్ దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఉన్న మైదానాలు చాలా విశాలంగా బాగున్నాయి. ఇక్కడి మైదానాల్లో క్రికెట్ ఆడితే ఆడినట్లుగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అం దరం కలిసి డబ్బులు వేసుకుని గ్రౌం డ్కు రెంట్ కడతాం.
-నవాజ్, క్రికెట్ క్రీడాకారుడు, నాంపల్లి, హైదరాబాద్
క్రికెట్ అంటే చాలా ఇష్టం..
క్రికెట్ అంటే చాలా ఇష్టం. బ్యాటింగ్ బాగా చేస్తా. అందుకే క్రికెట్ ఆడేందుకు ఎంత దూరమైనా వెళ్తా. హైదరాబాద్‌లో క్రికెట్ మైదానాలు అందుబాటులో ఉండవు. క్రికెట్ ఆడాలనుకునే వారు ఎక్కడైనా పార్కులు ఉంటే అక్కడ ఆడుతుంటారు. అయినా క్రికెట్ ఆడిన తృప్తి ఉండదు. క్రికెట్ మైదానంలో ఆడితేనే ఆడినట్లు ఉంటుంది. ఇప్పుడు సిటీకి దూరంగా క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు సమయం దొరికినా ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్తా. స్నేహితులందరం కొంత డబ్బులు వేసుకుని గ్రౌండ్‌కు రెంట్ చెల్లిస్తాం.
–జిషాన్, క్రికెట్ క్రీడాకారుడు, అత్తాపూర్, హైదరాబాద్