ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30 : రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం కోర్టు 75సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం కోర్టు ఆవరణలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా, మండల బార్అసోసియేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా, హైకోర్టు న్యాయవాదులు కూడా హాజరవుతున్నారు. ఇబ్రహీంపట్నం కోర్టుకు 1990లో ప్రభుత్వం శాశ్వత భవనాన్ని ఏర్పాటుచేసింది. ఈ భవనంలో సివిల్‌జడ్జి 2కోర్టులు, జూనియర్ సివిల్‌జడ్జి 2 కోర్టులతో ప్రస్తుతం కొనసాగుతున్నది.
ప్రారంభమైన ఇబ్రహీంపట్నం కోర్టుప్రస్థానం..
ఇబ్రహీంపట్నం తాలూకా కేంద్రంగా ఇబ్రహీంపట్నంలో కోర్టును ఏర్పాటుచేశారు. ఈ కోర్టు పరిధిలో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని 124గ్రామాలను కలుపుతూ ఇబ్రహీంపట్నం కోర్టును ఏర్పాటుచేసి 1946లో ప్రారంభించారు. 2020-21సంవత్సరానికి గానూ 75సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నంకోర్టు ఎంతోమంది కక్షిదారులకు న్యాయమందించింది. నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్ జిల్లాకేంద్రంగా ఇబ్రహీంపట్నంలో జిల్లా మున్సిఫ్కోర్టును ఏర్పాటుచేసింది. అప్పుడు అధికారభాష ఉర్దులో ఉండటం వలన కోర్టు తీర్పులు కూడా ఉర్దూలోనే ఉండేవి. రంగారెడ్డిజిల్లా ఏర్పడే నాటికి ఇబ్రహీంపట్నం హైదరాబాద్ జిల్లా కేంద్రంగానే పనిచేసింది. 1978సంవత్సరంలో రంగారెడ్డిజిల్లా కోర్టు ఏర్పాటు కాగానే ఇబ్రహీంపట్నం కోర్టు రంగారెడ్డిజిల్లా కోర్టు పరిధిలోకి వచ్చింది. మొదట బేగంపేట కేంద్రంగా ఆ తర్వాత సరూర్‌నగర్ కేంద్రంగా తదనంతరం 1999లో శాశ్వత భవనం నుంచి రంగారెడ్డికోర్టు విధులు నిర్వర్తిస్తున్నది.
కొత్త న్యాయస్థానాలు ఏర్పాటు..
ప్రభుత్వం 2014లో ఇబ్రహీంపట్నం అదనపు జూనియర్ సివిల్‌జడ్జి, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోరును ఏర్పాటు చేసింది. అలాగే, 2017లో స్పెషల్మెజిస్ట్రేట్ కోర్టును కూడా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటుచేయటం జరిగింది. ఇబ్రహీంపట్నంకోర్టు కక్షిదారులను జిల్లాకోర్టు వరకువెళ్లకుండా ఇక్కడే అన్ని కేసుల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది.
నేడు హాజరుకానున్న న్యాయమూర్తులు..
ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైకోర్టు న్యాయమూర్తులు అభిషేక్‌రెడ్డి, విజయసేనారెడ్డి, సంతోష్‌రెడ్డి, ఎం.లక్ష్మణ్, వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి రాజశేఖర్‌రెడ్డితో పాటు పలువురు జిల్లా, రాష్ట్రస్థాయి న్యాయమూర్తులు హాజరుకానున్నారు.
రూ.21కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన
ఇబ్రహీంపట్నంకోర్టు పరిధిలో ఉన్న రెండు సీనియర్ సివిల్‌జడ్జి కోర్టులు, రెండు జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులు ఒకే భవనంలో ఏర్పాటు చేయటం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.21కోట్లను మంజూరుచేసింది. ఈ కోర్టు భవన సముదాయానికి ఆదివారం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయమూర్తులు హాజరై శంకుస్థాపన చేయనున్నారు.
ఎంతో మంది న్యాయమూర్తులు పనిచేశారు..
ఇబ్రహీంపట్నం కోర్టులో అనేకమంది న్యాయమూర్తులు పనిచేసి తీర్పునిచ్చారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, హయత్‌నగర్ మండలాలకు ఈకోర్టు న్యాయస్థానంగా ఉండేది. ఇటీవల కందుకూరు, మహేశ్వరం మండలాలకు ప్రత్యేకించి అదనంగా మరో కోర్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం కోర్టు భవనంలో నాలుగు కోర్టులు కొనసాగుతున్నాయి. వీటన్నింటిని ఒకే గొడుగుకిందకు తీసుకురావటం కోసం ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
– ముద్దం వెంకటేశ్, బార్ అసోసియేషన్ కార్యదర్శి
సత్వర న్యాయం లభిస్తున్నది..
ఇబ్రహీంపట్నంకోర్టు ప్రారంభమైనప్పటి నుంచి నేటివరకూ పలు కేసుల్లో సత్వర న్యాయం అందించటంలో ఇబ్రహీంపట్నంకోర్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈకోర్టులో న్యాయమూర్తులంతా సేవాభావంతో పనిచేశారు. ఈ కోర్టు భవిష్యత్‌లో కూడా ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని న్యాయ సేవలు అందించేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తాం.
– శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు