పరిగి, ఏప్రిల్ 28 :రైతుల ఆర్థికాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే కస్టమ్ హైరింగ్ సెంటర్ల(సీహెచ్సీ)ను ఏర్పాటు చేసి అన్నదాతలకు తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నది. మండల మహిళా సమాఖ్యలు, మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నది. దీంతో వరికోత మిషన్లు, ట్రాక్టర్లు, నాగళ్లు తదితర పరికరాలు మార్కెట్ ధర కంటే 10శాతం తక్కువకే రైతులకు లభిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లో ఇప్పటికే సీహెచ్సీలు ఉండగా.. మిగిలిన 13 మండలాల్లోనూ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. మోమిన్పేట్లోని రైతు ఉత్పత్తి సంస్థ రూ.లక్ష, కులకచర్లలోని రామలింగేశ్వర రైతు ఉత్పత్తి సంస్థ రూ.2లక్షలు, తాండూరులోని రైతు ఉత్పత్తి సంస్థ రూ.50వేల పైచిలుకు లాభాలతో కొనసాగుతున్నాయి. సీహెచ్సీలతో రైతులు లాభపడటంతోపాటు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మండల మహిళా సమాఖ్యలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి.
రైతులకు మార్కెట్ ధర కంటే తక్కువగా అద్దెకు ఇచ్చే వ్యవసాయ యంత్ర పరికరాల అద్దె కేంద్రాలు ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రతి మండలంలో వ్యవసాయ యంత్ర పరికరాల అద్దె కేంద్రం(సీహెచ్సీ) ఏర్పాటు చేయడం ద్వారా ఓ వైపు రైతులకు తక్కువ ధరకే ఈ యంత్ర పరికరాలు అందుబాటులో ఉండగా మండల సమాఖ్యలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు లాభాలు ఆర్జించి పెట్టనున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటికే 6 మండలాల్లో సీహెచ్సీలు ఉన్నాయి. వాటిలో మోమిన్పేట్, కులకచర్ల, తాండూరు, బొంరాస్పేట్లలో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతుండగా దౌల్తాబాద్, ధారూర్లలో మండల మహిళా సమాఖ్యలు సీహెచ్సీ నిర్వహణ చూస్తున్నాయి. జిల్లాలో మొత్తం 19 మండలాలు ఉండగా.. మిగతా 13 మండలాల్లో ఈసారి సీహెచ్సీలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు అన్ని మండలాల్లో మండల సమాఖ్యల ద్వారా వాటి నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.30లక్షలతో వ్యవసాయ యంత్ర పరికరాలు…
ప్రతి మండలంలోని మండల సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్ర పరికరాల అద్దె కేంద్రాలు నెలకొల్పనుండగా.. ఒక్కో సీహెచ్సీ ఏర్పాటు చేసి వాటిలో యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు సుమారు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఖర్చవుతున్నది. ఇందులో 25శాతం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా సబ్సిడీ అందజేయనున్నారు. 10శాతం డబ్బులు సంబంధిత మండల మహిళా సమాఖ్యలు భరించాల్సి ఉంటుంది. మిగతా 65శాతం డబ్బులు మండల మహిళా సమాఖ్యల దగ్గర ఉంటే వెచ్చించవచ్చు. లేదంటే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతుంది. గిరిజన ప్రాంతాలు అత్యధికంగా ఉండే మండలాల్లో గిరిజన అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 35శాతం గ్రాంటు రూపంలో అందజేసే అవకాశం ఉంటుంది.
మార్కెట్ ధర కంటే తక్కువకు అద్దెకు…
వ్యవసాయ యంత్ర పరికరాల అద్దె కేంద్రాల్లో అందుబాటులో ఉండే యంత్ర పరికరాలను ఆయా మండలంలోని గ్రామాల రైతులకు మార్కెట్ ధర కంటే 10 శాతం తక్కువకు అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. మండలంలో ట్రాక్టర్, వరికోత మిషన్లు, ఇతర యంత్ర పరికరాలకు గంటకు ఎంత తీసుకుంటున్నారనేది తెలుసుకొని, దానికంటే 10శాతం తక్కువ ధరకు అధునాతనమైన యంత్ర పరికరాలు అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. సీహెచ్సీలలో ఏర్పాటు చేసే యంత్ర పరికరాలు నడిపించేందుకు డ్రైవర్లను అందుబాటులో ఉంచుతారు. సీహెచ్సీ ఫోన్ నంబర్ మండలంలోని అన్ని గ్రామాల రైతులకు తెలియజేయడం, తమకు ఏ యంత్ర పరికరం అద్దెకు కావాలన్నది ఫోన్ ద్వారా రైతులు సమాచారం అందిస్తే, వరుస సంఖ్యలో బుక్ చేసుకున్న వారందరికీ యంత్ర పరికరాలను అందించడం జరుగుతుంది.
తద్వారా రైతులకు తక్కువ ధరకే యంత్ర పరికరాలు అద్దెకు లభించగా మండల మహిళా సమాఖ్యలకు ఆదాయం చేకూరుతుంది. జిల్లాలోని మోమిన్పేట్ రైతు ఉత్పత్తి సంస్థ లక్ష రూపాయలు, కులకచర్లలోని రామలింగేశ్వర రైతు ఉత్పత్తి సంస్థ సుమారు రూ.2లక్షలు, తాండూరులోని రైతు ఉత్పత్తి సంస్థ రూ.50వేల పైచిలుకు లాభాలలో కొనసాగుతున్నాయి. రైతులకు యంత్ర పరికరాలు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బుల్లో డీజిల్, యంత్ర పరికరాల మరమ్మతు, డ్రైవర్లకు వేతనం పోను లాభాలు ఆర్జిస్తున్నాయి. సీహెచ్సీల ద్వారా మండల మహిళా సమాఖ్యలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతోపాటు వ్యాపారాభివృద్ధికి ఈ కేంద్రాలు దోహదం చేస్తాయని చెప్పవచ్చు.
అందుబాటులో యంత్ర పరికరాలు..
వ్యవసాయ యంత్ర పరికరాల అద్దె కేంద్రాల్లో ఆయా మండలాల్లో సాగు చేసే పంటలకు ఉపయోగపడే యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. ఇందుకు గాను మండల వ్యవసాయాధికారి, ఉద్యానవన అధికారి, మండల మహిళా సమాఖ్య సభ్యులు, రైతులు, ఆయా మండలాల్లోని ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో భూమి పరిస్థితి, ఆయా భూములలో సాగు చేసే పంటల వివరాలు సేకరించడంతోపాటు ఈ పంటల సాగులో ఏ యంత్ర పరికరాలు అవసరమవుతాయని గుర్తించడం జరుగుతుంది. వరి, పప్పు దినుసులు, మొక్కజొన్న పంటలు సాగు చేసే ప్రాంతాల్లో వరికోత మిషన్లు, ట్రాక్టర్లు, రోటో వీటర్లు, 9 నాగళ్లు, 5 నాగళ్లు, పెద్ద నాగళ్లు, ఇతర పరికరాలు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. తద్వారా ఆయా ప్రాంతాల్లోని రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
రైతులకు తక్కువ ధరకే అద్దెకు యంత్ర పరికరాలు
మండలాల్లో సీహెచ్సీల ఏర్పాటు ద్వారా రైతులకు మార్కెట్ ధర కంటే తక్కువకే వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు లభిస్తాయి. సీహెచ్సీల ద్వారా రైతులు వ్యవసాయ యంత్ర పరికరాలు ఉపయోగించుకొని వ్యవసాయ యాంత్రీకరణ చేసుకొని ఖర్చులు, శ్రమను తగ్గించుకోవాలి. మరోవైపు సీహెచ్సీల నిర్వహణ ద్వారా రైతు ఉత్పత్తి సంస్థలు, మండల మహిళా సమాఖ్యలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ప్రతి మండలంలో సీహెచ్సీ ఏర్పాటుతో జిల్లాలోని అన్ని మండలాల్లో అద్దెకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. – ఎస్.శ్రీనివాస్, డీపీఎం, వ్యవసాయ జీవనోపాధి, ఫుడ్ ప్రాసెసింగ్