యాచారం, ఏప్రిల్ 29 : ప్రజాసమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుకన్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయం, పశుపోషణ, విద్యా, విద్యుత్, హార్టికల్చర్, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, ఎక్సైజ్, ఈజీఎస్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ అధికారి సత్యనారాయణ తీరుపై తక్కళ్లపల్లితండా, కొత్తపల్లి గ్రామాల సర్పంచ్‌లు రమావత్ జగదీశ్, హాబీబుద్దీన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ శాఖ అధికారులు సమస్యలు పరిష్కరించాలని ఏఈ సందీప్‌కుమార్‌ను సర్పంచ్‌లు జగదీశ్, భాషయ్య, ఎంపీటీసీ లక్ష్మమ్మ కోరారు. తక్కళ్లపల్లితండాలో స్తంభాలు వేసి కనెక్షన్ మరిచారిని సర్పంచ్ జగదీశ్ పేర్కొన్నారు. మల్కీజ్‌గూడలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ యాదమ్మ కోరారు.
వెంచర్లకు అనుమతులు లేకుండా ప్రహరీలను నిర్మిస్తున్నారని వెంటనే కూల్చి వేయాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద, గాండ్లగూడ వద్ద సాగర్ రహదారి పైపులైన్ పనుల్లో ధ్వంసమైందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ ఏఈకి విన్నవించారు. వేసవిలో కూలీలందరికీ ఉపాధి పనులు కల్పించాలని ఏపీవో లింగయ్య దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సభ్యులు కోరారు. మొండిగౌరెల్లిలో అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ లక్ష్మమ్మ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. బాల్య వివాహాలపై ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మహిళలు 1098కు కాల్ చేయాలని సీడీపీవో సూచించారు.
త్వరలో యాచారం, చింతపట్ల, నందివనపర్తి, మంథన్‌గౌరెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుకన్య మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పల్లె ప్రగతి పనులను పూర్తి చేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ మహమూద్ అలీ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో శ్రీలత, వ్యవసాయాధికారి సందీప్, సీడీపీవో సృజన, ఏపీవో లింగయ్య, పశువైద్యాధికారి వనజ, ఏపీఎం సతీశ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.