నవాబుపేట, ఏప్రిల్ 28 : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన యెల్లకొండ పల్లె ప్రకృతివనం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రకృతి రమణీయతను పంచుతున్న పల్లె ప్రకృతివనంతో గ్రామానికి కొత్త శోభ సంతరించుకున్నది. ప్రకృతివనంలో ఏపుగా పెరిగిన వివిధ రకాల మొక్కలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఊరు చివరన ఉన్న ప్రకృతి వనం గ్రామంలోకి వచ్చే వారికి స్వాగతం పలికినట్లు కనిపిస్తున్నది. గ్రామపంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ కలుపు మొక్కలను తీయడం, నీళ్లు పోయడం వంటి పనులు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో జామ చెట్లు, ఇతర నీడనిచ్చే మొక్కలు కూడా ఉన్నాయి. నవాబుపేట మండల పరిధిలో 32 గ్రామపంచాయతీలు ఉండగా వాటికి యెల్లకొండ పల్లె ప్రకృతి వనం ఆదర్శంగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
యెల్లకొండ గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనంలో 2,000 మొక్కలను పెంచుతున్నారు. ఇటీవల కాలంలో మండల స్థాయి అధికారులు పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన్నప్పుడు గ్రామపంచాయతీ సంబంధించిన వాతావరణాన్ని చూసి మురిసిపోయారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జోరుగానే జరుగుతున్నాయని కితాబిచ్చారు. రోడ్డుకు ఇరువైపుల నాటిన హరితహారం మొక్కలు పెరిగి గ్రామానికి అందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతున్నాయని పలువురు గ్రామ పంచాయతీని, గ్రామపంచాయతీ పరిధిలోని పర్వతీ పరమేశ్వరుల దర్శనానికి వచ్చే వారు సైతం గ్రామం హరితహారం మొక్కల గురించి చర్చించుకోవడం విశేషం. బీటీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను చూసి కొంతమంది మెయిన్ రోడ్డు(గెట్టు వద్దకు) నడుచుకుంటూ పచ్చని చెట్లనీడకు కూర్చోని వెళ్తుంటారు. ఇదంతా సర్పంచ్, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యమైందని పలువురు పేర్కొంటున్నారు.