పరిగి, ఏప్రిల్ 27 : జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించను న్నందున తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. జిల్లాలో 9350 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 8215 మంది ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు, మొత్తం 17,565 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 32 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఏఎన్‌ఎంతోపాటు వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
జిల్లాలో పరీక్షా ప్రశ్నాపత్రాలను నిలువ చేసేందుకు, తరలించేందుకు పోలీసులు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షా సమయాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, 144 సెక్షన్ విధించాలని సూచించారు. తప్పనిసరిగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసు కోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు ఫ్లైయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో మంచి నీరు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి శంకర్‌నాయక్, ఏఎస్పీ(డీటీసీ) మురళీధర్, డీఎస్పీ సత్యనారాయణ, జిల్లా వైద్యాధికారి తుకారాం, ఇంటర్మీడియెట్ పరీక్ష నిర్వాహకులు బుచ్చయ్య, రాజామోహన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.