షాబాద్, ఏప్రిల్ 27 : జిల్లా పరిధిలోని పోలీసు శిక్షణా సంస్థల్లో రెండు నెలల పాటు ఉచిత ప్రీ ఎగ్జామినేషన్ కోచింగ్‌ను రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్, పోలీసు శాఖలు కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కోసం అర్హులైన వంద మంది షెడ్యూల్డ్ కులాల యువతీ యువకులకు అవకాశం కల్పించినట్లు చెప్పా రు. పురుష అభ్యర్థులకు కండ్లకోయ (మేడ్చల్)లోని పోలీసు ట్రైనింగ్ సెంటర్, మహిళా అభ్యర్థులకు పసుమాముల(హయత్‌నగర్)లోని నారాయణ ఐఏఎస్ అకాడమీ వద్ద రెసిడెన్షియల్(భోజనం వసతితో కూడిన శారీరక, రాత పరీక్షలకు తగిన)శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
పురుషుల కనీస ఎత్తు (167.6 సెం.మీ) చాతి (86.3 సెం.మీ)గాలి పీల్చినప్పుడు(5 సెం.మీ) అదనపు కొలత ఉండాలని చెప్పారు. అలాగే మహిళల కనీస ఎత్తు (152.5 సెం.మీ) కలిగి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన వారు విద్యార్హతల సర్టిఫికెట్లతో ప్రవేశం పొందవచ్చన్నారు. వీరి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించకుండా ఉండాలన్నారు. ఇతర వివరాలకు శ్రీధర్ (98499 03555), సంయుక్త సంచాలకులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ రంగారెడ్డి జిల్లా వారిని, సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వెంకట్(9440521419), కండ్లకోయ శిక్షణా సంస్థ, కె.లావణ్య (98484 82528) పసుమాముల శిక్షణ సంస్థలో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.