షాబాద్, ఏప్రిల్ 27: పిల్లల్లో ఎత్తు, బరువు పెరుగుదలకు, రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత సీడీపీవోలు, సూపర్వైజర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోషణ అభియాన్‌పై సంబంధిత సీడీపీవోలు, సూపర్ వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో ఎత్తు బరువు పెరుగుదలకు, రక్తహీనత, పౌష్టిక ఆహారం లోపం అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు పోషణ విలువలతో కూడిన పౌష్టికాహారం అందించాలని తెలిపారు. మండలాల వారీగా పిల్లలతో ప్రస్తుతం ఉన్న బరువు, ఉండాల్సిన బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచి ఎప్పటికప్పుడూ అప్డేట్ చేయాలని సూచించారు. జిల్లాలో ఎస్ఏఎస్(అతితీవ్రలోప పోషణ), ఎంఏఎమ్(తీవ్ర లోప పోషణ)లేకుండా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మోతి, సీడీపీవోలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.