తలకొండపల్లి, ఏప్రిల్ 27: గుర్తు తెలియని దుండగులు చెరువులో విషం కలపడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన బుధవారం దేవునిపడకల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని దేవునిపడకల్ గ్రామంలో ఈరన్న చెరువులో గుర్తు తెలియని దుండగులు విషం కలపడంతో 8 టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. మరో 3 టన్నుల చేపలు కొన ఊపిరితో ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ. 4 లక్షలు ఖర్చు చేసి చెరువులో చేపలు వదిలారు. చెరువులో విషం కలపడంతో మేకలు, గొర్రెల కాపరులు, పాడిపశువులు నీరు తాగకుండా జాగ్రత్తగా ఉండాలని సమీప రైతులకు సూచించారు. చెరువును ఉపసర్పంచ్ తిరుపతి, మత్య్సకారులు పరిశీలించారు.