రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జిల్లాలో గులాబీ పార్టీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది. ఏ ఎన్నికలు జరిగినా జిల్లాలో గులాబీ పార్టీదే హవా. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పాగా వేసింది. చిన్న చిన్న పదవుల నుంచి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల వరకూ అధికార పార్టీదే జోరు కొనసాగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండటంతో ఆయా పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజానీకం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి జై కొడుతున్నాయి. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన నాటి నుంచే ఇతర పార్టీలవారు కారెక్కారు. అదేవిధంగా జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు కాలం చెల్లినట్లేనని, ఇక భవిష్యత్తు అంతా టీఆర్ఎస్దేనని గుర్తించిన ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు మొదలుకొని కార్యకర్తల వరకు అందరూ గులాబీ కండువా కప్పుకోవడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మారింది. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో బలంగా తయారైంది. ఒకప్పుడు కేడర్‌లేని పార్టీకి ప్రస్తుతం పూర్తి కేడర్‌తో కూడుకొని ఉన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో జిల్లా టీడీపీ కంచుకోటగా ఉండేది. మిగతా పార్టీల బలం అంతంతాగానే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాష్ర్టాన్ని అడ్డుకునేందుకుగాను కేంద్రానికి లేఖ రాయడంతో జిల్లాలో టీడీపీ పతనం మొదలైంది. ఈ అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే టీడీపీకి నూకలు చెల్లిన పరిస్థితి నెలకొన్నది.
సాధారణ ఎన్నికల్లోనూ, ప్రత్యక్ష ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేసినప్పటికీ.. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీడీపీని ప్రజలు గుర్తించలేరు. అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతంతా మాత్రంగానే ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు చేసిన ఉద్యమ తీవ్రతకు, సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే అప్పటి యూపీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసినా.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం ఇచ్చిందని ప్రచారం చేసుకున్నప్పటికీ ప్రజలు విశ్వసించకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడం, రాష్ర్టాన్ని సాధించడంతో ప్రజలు గులాబీ పార్టీ వైపు నిలిచారు. ఈ అంశాలను జిల్లాలో టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి అన్ని ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయడంతో పార్టీ మరింత బలపడింది.
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు..
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ బలోపేతం కావడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గతంలో వేసవి వస్తే చాలు గుక్కెడు నీటి కోసం ప్రజలు తహతహలాడే పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం మండుటెండలోనూ ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఏడాదిలోనే ఇంటింటికీ నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ నీటి సమస్యకు పరిష్కారం చూపారు. అన్నదాతల కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ ఏడాదిలో ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నది. రైతులు చనిపోతే రూ.5 లక్షల బీమానూ అమలు చేస్తున్నది. మరోవైపు రూ.లక్ష పంట రుణాలను ఇప్పటికే ఒక దఫా మాఫీ చేయగా, రెండో దఫాలోనూ రూ.50 వేలలోపు రుణాల్లో మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను రూ.200 నుంచి రూ.1000లకు, వికలాంగుల పింఛన్‌ను రూ.500ల నుంచి రూ.1500లకు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. అదేవిధంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం 1000 పింఛన్‌ను రూ.2016, రూ.1500 పింఛన్‌ను రూ.3016లకు పెంచి భరోసా నింపారు.
ఆసరా పథకంతోపాటు ఆహారభద్రత పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నది. అదేవిధంగా చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను మిషన్ కాకతీయ, పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో చేయూతనందిస్తున్నది. జిల్లాలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించడంతోపాటు గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లు, ప్రతి గ్రామపంచాయతీల్లోనూ సీసీ రోడ్ల ఏర్పాటుకు భారీగా నిధులు వెచ్చించి పూర్తిగా జిల్లా రూపురేఖలు మారిపోయేలా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
జిల్లా పరిషత్, మండల పరిషత్, నాలుగు మున్సిపాలిటీలు టీఆర్ఎస్వే..
పరిగి, ఏప్రిల్ 26 :ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం కేసీఆర్ నూతనంగా వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటు తర్వాత మొదటిసారి జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక జడ్పీటీసీలు గెలుచుకొని జడ్పీని కైవసం చేసుకున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో సైతం వికారాబాద్ ప్రాంతంలో టీఆర్ఎస్కు అత్యధికంగా జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ స్థానాలు దక్కాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో 18 మండలాలకు ఎన్నికలు జరుగగా ప్రస్తుతం 15 మంది జడ్పీటీసీలు, 15 మంది ఎంపీపీలు టీఆర్ఎస్ వారు కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పట్నం సునీతా మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 203 ఎంపీటీసీ స్థానాలుండగా మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో నాలుగు మున్సిపాలిటీలు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. పార్టీ రహితంగా జరిగిన సర్పంచ్ స్థానాల్లో సైతం మెజార్టీగా టీఆర్ఎస్ మద్దతుదారులే గెలుపొందారు. జిల్లావ్యాప్తంగా 566 గ్రామపంచాయతీలు ఉండగా 80 నుంచి 90 శాతం వరకు టీఆర్ఎస్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా విజయం సాధించడం గమనార్హం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా పరిధిలో 18 ఉండగా 17 పీఏసీఎస్ చైర్మన్లు టీఆర్ఎస్ వారే. జిల్లావ్యాప్తంగా రెండు జాతీయ పార్టీలకు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ప్రజా ప్రతినిధులు ఉన్నారు. తద్వారా జిల్లా పరిధిలో 90 శాతానికి పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కొనసాగుతున్నారని చెప్పవచ్చు.
భవిష్యత్తంతా టీఆర్ఎస్దే..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. జిల్లాలో ఇతర పార్టీలకు కాలం చెల్లింది. భవిష్యత్ అంతా టీఆర్ఎస్ పార్టీదే. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దే అనే విధంగా పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతమైంది. జిల్లాలో పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పారు. కొత్త ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు అమెజాన్, టాటా, విప్రోలాంటి దిగ్గజ కంపెనీలు జిల్లాలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సంతోషం.
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి