శంకర్పల్లి, ఏప్రిల్ 25 : దోమల నివారణకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ దవాఖాన హెచ్‌ఈవో శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రపంచ మలేరియా దినం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధులు దోమల వల్ల సంక్రమిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీటి గుంతల్లో నీరు నిల్వఉండకుండా చూడాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే గా చేపట్టి నీటిని తోడివేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం మరియకుమారి, ల్యాబ్ టెక్నీషియన్ నాగేశ్, సూపర్వైజర్లు స్వరాజ్యలక్ష్మి, రాజేశ్కన్న, స్టాఫ్ నర్స్ నెహ్రూ, హెల్త్ అసిస్టెంట్ మన్సూర్, సుదర్శన్‌రెడ్డి, జానకి పాల్గొన్నారు.
మలేరియా నిర్మూలనకు కృషి చేయాలి
షాబాద్, ఏప్రిల్ 25 : మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యసిబ్బంది పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా షాబాద్ మండల కేంద్రంలో వైద్యసిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియా నివారణలో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. రోజుల తరబడి నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది లక్ష్మమ్మ, సౌజన్య, సుజాత, రాములు, లక్ష్మి పాల్గొన్నారు.
యాచారం మండలంలో ర్యాలీ
యాచారం, ఏప్రిల్25: మలేరియా వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ వైద్యాధికారి ఉమాదేవి అన్నారు. సోమవారం ప్రపంచ మలేరియా దినం సందర్భంగా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం మలేరియాను పారద్రోలాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి ఉమాదేవి మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌ను నిర్వహించి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు లలిత, హెచ్‌ఈవో శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.