రంగారెడ్డి, ఏప్రిల్ 22, (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలోని రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిపడా కొనుగోలు కేంద్రాలతోపాటు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ధాన్యం ఈనెలాఖరు వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతోపాటు అక్కడ అవసరమైన మౌలిక వసతులను కూడా కల్పించనున్నారు. కాగా
ఇటీవల ఆరు కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. మిగతా కొనుగోలు కేంద్రాలను వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాతో కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా పెంచాలని జిల్లా పౌరసరఫరాల అధికారులు నిర్ణయించారు. ముందుగా 41 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించగా.. మరో 9 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో అధిక ధాన్యం వచ్చే అవకాశాలున్న దృష్ట్యా ఆయా నియోజకవర్గాల్లో 9 కొనుగోలు కేంద్రాలను పెంచాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో 47,231 ఎకరాల్లో వరి సాగు చేయగా, 1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా అవసరాలకు పోను 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల సంఖ్య 50కి చేరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల మంచాల, యాచారం మండలాల్లో ఆరు కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారం భించారు. ఐకేపీ ఆధ్వర్యంలో రెండు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాలు ప్రారంభమయ్యా యి. వాటిలో కొనుగోళ్లు చకచకా సాగుతున్నాయి. మిగతా కొనుగోలు కేంద్రాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా రైతులు ధాన్యాన్ని విక్రయించడంలో ఇబ్బందులు పడకుండా గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూడకుండా తేదీల వారీగా రైతులకు టోకెన్లను జారీ చేసి ధాన్యాన్ని కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతులకు 1960 మద్దతు ధర అందించేలా చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు లు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో 9 లక్షల గన్నీ బ్యాగులు
జిల్లాకు సరిపడా గన్నీబ్యాగులు అందుబాటులో ఉం డేలా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు 17 లక్షల గన్నీ బ్యాగులు అవసరంకాగా, ప్రస్తుతం 9 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 3.50 లక్షల గన్నీ బ్యాగులు రైస్ మిల్లర్ల వద్ద ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా గన్నీ బ్యాగులను కూడా ఈనెలాఖరులోగా సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గన్నీ బ్యాగులను తిరిగి ఇవ్వని రైస్ మిల్లర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, గన్నీ బ్యాగులు వెన క్కి ఇవ్వకపోతే ఒక్కొ గన్నీ బ్యాగుకు రూ.5ల చొప్పు న వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.