ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 22 : రంగారెడ్డిజిల్లా శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఇప్పటికే శివారుప్రాంతాల్లోని ఔటర్‌రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు, రక్షణరంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో మరిన్ని కొత్త కంపెనీల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నందున త్వరలోనే మరిన్ని ప్రఖ్యాత సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, అబ్దుల్లాపూర్‌మెట్, యాచారం తదితర మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు భూములను కొనుగోలు చేశారు. శివారు ప్రాంతాల్లో ఆదిబట్ల మున్సిపాలిటీలో టీసీఎస్ ఏర్పడిన తరువాత పరిసర ప్రాంతాల్లో ఐటీ సంస్థలకు స్వర్గధామంగా మారింది. కాగా, ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే ఏర్పాటైన రక్షణరంగ సంస్థలకు అనుబంధంగా కొత్తగా క్లస్టర్పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే క్లస్టర్ పార్కుకు వంద ఎకరాలను టీఎస్ఐఐసీ కేటాయించి రోడ్లు, విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి, దరఖాస్తు చేసుకున్న ఆయా సంస్థలకు భూముల కేటాయింపు కూడా జరిగింది. దీంతో క్లస్టర్పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారు.
వంద ఎకరాల్లో క్లస్టర్ పార్కు..
ఇబ్రహీంపట్నంలోని తట్టిఖాన సమీపంలో వంద ఎకరాల్లో క్లస్టర్పార్కు ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు సిద్ధమయ్యాయి. హెల్మెట్ నుంచి హెలికాప్టర్ వరకు ఉపయోగించే ఫైబర్గ్లాస్లు ఇక్కడ తయారుచేస్తారు. అలాగే, యుద్ధ విమానాలకు ఉపయోగించే బుల్లెట్‌ఫ్రూప్ గ్లాస్లు కూడా ఇక్కడ తయారుచేస్తారు. కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కూడా క్లస్టర్పార్కులో ఫైబర్గ్లాస్లు, బుల్లెట్ఫ్రూజ్ గ్లాస్‌లను తయారుచేసే పారిశ్రామిక వేత్తలకు రాయితీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. క్లస్టర్పార్కు కోసం 100ఎకరాలను ప్రభుత్వం టీఎస్ఐఐసీకి కేటాయించింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో క్లస్టర్పార్కులో విశాలమైనరోడ్లు, విద్యుత్‌సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం, తాగునీరు వంటి సౌకర్యాలను పూర్తిచేశారు. 52మంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటం కోసం ఇప్పటికే భూములను కూడా కేటాయించారు. ఈ క్లస్టర్పార్కు ప్రపంచంలోనే అతిపెద్ద రెండోవదిగా తయారుకానున్నది. క్లస్టర్పార్కు సమీపంలోనే ఎన్ఎస్జీ, ఆక్టోపస్, బీడీఎల్, ఎన్పీఏ వంటి రక్షణరంగ సంస్థలు కూడా ఉన్నాయి. వీటికి అనుబంధంగా క్లస్టర్పార్కును ఇక్కడే ఏర్పాటు చేశారు.
మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం
రంగారెడ్డిజిల్లా శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు షాద్‌నగర్ నియోజకవర్గంలోని మరికొన్ని ప్రాంతాల్లో త్వరలోనే మరిన్ని కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గంలో విప్రో, అమెజాన్, నోకియా వంటి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అవసరమైన భూములను కూడా కేటాయించింది. మామిడిపల్లిలో వంద ఎకరాల్లో అమెజాన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో హెలికాప్టర్ల విడిభాగాల తయారీకి సంబంధించిన పరిశ్రమలతో పాటు హ్యుందాయ్ కంపెనీ ఏర్పాటుకు కావల్సిన భూములను కూడా కేటాయించింది. భూములకు సంబంధించి రైతులకు పరిహారాన్ని కూడా ప్రభుత్వం అందజేసింది. మరికొంతమంది పట్టాదారుల భూములకు సంబంధించిన పరిహారం కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటికే విడుదలైంది. త్వరలోనే వారికి కూడా పరిహారాన్ని చెల్లించి ఈ భూములను ఆయా సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పెద్దపీట
రంగారెడ్డిజిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న ఔత్సాహిక, పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పటికే ఆదిబట్ల సమీపంలోని టీసీఎస్, టాటా ఎరోస్పేస్, కాగ్నిజెంట్ తదితర పరిశ్రమలకు పలుమార్లు విచ్చేసి వారి అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించారు. అలాగే, కొత్తగా ఏర్పాటుచేసే పరిశ్రమలకు కూడా విద్యుత్, తాగునీరుతో పాటు సంబంధిత మున్సిపాలిటీలన్నింటికీ అనుమతులను కూడా వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రావిర్యాల సమీపంలో అతిపెద్ద నోకియా కంపెనీ కూడా మంత్రి కేటీఆర్ చొరవతోనే ఇక్కడ ఏర్పాటుకు ముందుకొచ్చారు. అలాగే, ఫార్మాసిటీ కూడా మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో చకచకా ముందుకు సాగుతుండగా ఆ పరిసర ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమల ఏర్పాటు కూడా త్వరలోనే జరుగనున్నది.
ప్రభుత్వం అండగా నిలిచింది
రంగారెడ్డిజిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం భూమిఉన్న రైతు కోటీశ్వరులుగా మారారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా రంగారెడ్డిజిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితిలో ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక రంగంలో దిగ్గజాలైన పలువురు ముందుకొస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తున్నది. భవిష్యత్తులో రంగారెడ్డిజిల్లా శివారు ప్రాంతాలు ఐటీ, రక్షణరంగం, ఫార్మా తదితర సంస్థలకు హబ్‌గా మారనున్నది.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు