షాబాద్, ఏప్రిల్ 22 : యాసంగిలో పచ్చిమిర్చి పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. మార్కెట్లో పచ్చిమిర్చికి మంచి ధర పలుకుతుండటంతో రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. రెండేండ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా, ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు పుష్కలంగా పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారిస్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చే పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని బోరుబావుల కింద అర ఎకరం, ఎకరం, రెండు ఎకరాల వరకూ పచ్చిమిర్చి పంటను సాగు చేస్తున్నారు. కూరగాయల కంటే మార్కెట్లో పచ్చిమిర్చికి మంచి ధర పలుకుతున్నది. కిలోకు రూ. 50 నుంచి రూ.70 వరకు పలుకడంతో క్వింటాల్ ధర రూ.7వేల వరకు పలుకుతున్నది.
తగిన జాగ్రత్తలతో పంట రక్షణ
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని 26 మండలాల్లో ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతులు 1059 ఎకరాల్లో పచ్చిమిర్చి పంటను సాగు చేసినట్లు సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఎప్పటికప్పుడూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. విత్తనం నాటిన నుంచి పంట కోతకు వచ్చే వరకూ పంటకు ఏ మందులు వాడాలో అవగాహన కల్పిస్తున్నారు. పంటల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు పాటించి లాభాలు పొందుతున్నారు. మిర్చి పంటకు చీడపీడల బెడద లేకుండా ముందస్తుంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తూ పంటను కాపాడుకుంటున్నారు. జిల్లాకు చెందిన రైతులు శంషాబాద్, షాద్నగర్, చేవెళ్ల, గుడిమల్కాపూర్, రైతుబజార్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు.
మంచి లాభాలున్నాయి
ఇతర పంటల కన్నా మిర్చిపంట సాగులో మంచి దిగుబడులు ఉన్నాయి. నేను ప్రతి ఏడాది మిర్చి పంటను సాగు చేస్తా. అధికారుల సలహాలు, సూచనలు పాటించి పంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నా. ఒక ఎకరం పచ్చిమిర్చి సాగుచేశా. మార్కెట్లో కూడా మిర్చికి మంచి ధర ఉండడంతో ఖర్చులు పోగా, ఆదాయం కూడా మంచిగానే వస్తుంది.
-శ్రీకాంత్, రైతు చేవెళ్ల మండలం
1059 ఎకరాల్లో మిర్చిసాగు
జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతులు 1059 ఎకరాల్లో పచ్చిమిర్చి పంటను సాగుచేశారు. పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా మండలాల పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు ఎప్పటికప్పుడూ సలహాలు, సూచనలు అందిస్తున్నాం. బోరుబావుల కింద రైతులు సాగుచేసిన మిర్చిపంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు కూడా మంచి ఆదాయం వస్తున్నది.
-సునందారాణి, రంగారెడ్డిజిల్లా హార్టికల్చర్ అధికారి