మంచాల, ఏప్రిల్ 22 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో అడిషనల్ పీడీ జంగారెడ్డి అన్నారు. శుక్రవారం మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నోములలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎంపీపీ జాటోతు నర్మద, జడ్పీటీసీ నిత్య ప్రారంభించారు. నోముల, చిత్తాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం డీఆర్డీవో అడిషనల్ పీడీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బొడ్డు నాగరాజుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు సుకన్య, చీరాల రమేశ్, జయానందం, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ, ఏపీవో శోభ, గ్రామ సంఘం అధ్యక్షరాలు లత, అన్నపూర్ణ, సీసీ సంతోష, వీవోఏలు స్వప్న, శివరాణి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
ఇబ్రహీంపట్నం : రైతులు పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు మద్దతు ధర పొందాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు గానూ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో మంచాల మండలంలోని నోముల, బోడకొండ, ఇబ్రహీంపట్నం మండలంలో ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో కొహెడ, బండరావిరాల, మాడ్గుల మండలంలో నాగిళ్ల, ఆర్కపల్లి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1960 చొప్పున మద్దతు ధర నిర్ణయించిందన్నారు. రైతులంతా దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యాన్ని విక్రయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్, కౌన్సిలర్లు నల్లబోలు మమత, టీఆర్ఎస్ నాయకులు జగదీశ్, చందు, డీసీఎంఎస్ అధికారులు పాల్గొన్నారు.