షాద్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 20: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని మినీ స్టేడియంలో మెగా హెల్త్ మేళాను బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న మెరుగైన సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే హెల్త్ కార్డులపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించి అందజేయాలన్నారు.
హెల్త్ కార్డు ఉన్నవారికి 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించడం సంతోషకరమన్నారు. షాద్‌నగర్‌లో సదరం క్యాంప్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం పాలీయేటివ్ కేంద్రాన్ని చేవెళ్లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు హోమ్‌కేర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆధా ర్, ఫోన్ నంబర్ ఉన్నవారికి హెల్త్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రజలకు వైద్య సేవలపై అవగాహన కల్పించే విధం గా అవగాహన బెలూన్ను ఎగరవేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి మందులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కనయాదవ్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్ పావని, ప్రతాప్‌రెడ్డి, బచ్చలి నర్సింహులు, శ్రీనివాస్, అంతయ్య, వెంకట్రాంరెడ్డి, రాజేశ్వర్, డీఎంవో రాఖేశ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్, సూపరింటెండెంట్ పద్మలత, ఎంఈవో శంకర్‌రాథోడ్, వైద్యులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మన బస్తి-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మన బస్తి-మన బడి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాలలో రూ. 2.6 లక్షలు, రామ్నగర్కాలనీ ప్రాథమిక పాఠశాలలో రూ.3.97లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన బస్తి-మన బడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ మాధురి, మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, ఎంఈవో శంకర్‌రాథోడ్, మాజీ చైర్మన్ విశ్వం, నాయకులు నారాయణరెడ్డి, పాండురంగారెడ్డి, సందీప్ పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతికి కృషి
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్హెచ్బీ బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి రుణాల అందజేత కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్డీవో పీడీ ప్రభాకర్, ఎంపీవో కల్యాణి, కొత్తూరు ఎంపీడీవో శరత్‌బాబు, బ్యాంక్ లింకేజీ డీపీఎం బాల్‌రాజు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ స్వర్ణలత, స్త్రీనిధి ఆర్ఎం ఉదయ, ఏపీఎం నాగేశ్, సీసీలు, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్లు, గ్రామ సంఘం వీవోఎల్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం వినతి
మున్సిపాలిటీలోని 22వ వార్డులో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌కు టీఆర్ఎస్ నాయకుడు నడికూడ యాదగిరియాదవ్ వినతిపత్రం అందజేశారు. వార్డులో బీసీలు ఎక్కువగా ఉన్నారని, కమ్యూనిటీహాల్‌ను ఏర్పాటు చేస్తే సమావేశాలను నిర్వహించుకొని సమస్యలను త్వరగా పరిష్కరించుకోవడానికి వీలు ఉంటుందన్నారు.
సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం
షాద్‌నగర్‌రూరల్ : సంపూర్ణ అక్షరాస్యతతో రాష్ట్రం మరింత పురోగతిని సాధిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మన ఊరు-మన బడికి ఎంపికైన మండలంలోని ఎలికట్ట, కదివనం జిల్లా పరిషత్ పాఠశాలలను బుధవారం సందర్శించారు. కదివనం పాఠశాలలో రూ. 29.55 లక్షలతో నూతనంగా నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణ పనులను ప్రారంభించారు. శిక్షణ పూర్తయిన ఉపాధ్యాయులకు ఆన్లైన్లో వెబినర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తారన్నారు. అదే విధంగా మొగిలిగిద్ద గ్రామానికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, ఎంపీటీసీ శ్రీశైలం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సాయిప్రసాద్, ఉప సర్పంచ్ మల్లేశ్, నాయకులు సూర్యప్రకాశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కొత్తూరు రూరల్: మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో గల సయ్యద్ హజరత్ జహంగీర్‌పీర్ దర్గాలో సర్వేనెంబర్ 201లో గల ముస్లింల శ్మశాన వాటికను జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత తన సొంత నిధులతో బుధవారం మరమ్మతులు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శోభ, సర్పంచ్‌లు అజయ్‌నాయక్, సత్తయ్య, ఉపసర్పంచ్ శ్రీరాములుయాదవ్, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి సిరాజ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రషీద్, నాయకుడు ఎమ్మె సత్యనారాయణ పాల్గొన్నారు.