కొత్తూరు రూరల్, ఏప్రిల్ 18: రంగారెడ్డి జిల్లాలోనే కొత్తూరు మండలంలోని 7 గ్రామాల్లో భూగర్భ జలాల నీటి మట్టం అట్టడుగుకు చేరుకున్నాయని, భూగర్భ జలాల పెరుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో శరత్చంద్రబాబు ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహించిన డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతివనం, బృహత్ ప్రకృతి వనం, శ్మశానవాటిక, నర్సరీ, హరితహారం, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, కల్లాలు, క్యాటిల్ షెడ్ వంటి అభివృద్ధి పనులపై నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, ఎస్ఆర్పీ గంగరాజు, ఎస్టీఎం జ్ఞానేందర్ హాజరై ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో సోషల్ ఆడిట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామాల వారీగా సోషల్ ఆడిట్‌ను నిర్వహించారు. మూడేండ్లుగా గ్రామాల్లో నిర్వహించిన ఎన్ఆర్ఈజీఎస్ పనులపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు.
రికార్డులను సరిగ్గా నిర్వహించలేకపోవటం, మొక్కల పెంపకం, జాబ్ కార్డుల జారీ వంటి వాటిపై సిద్దాపూర్ పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి మెర్సీ, ఈజీఎస్ టీఏ సుబ్బారావు, ఈసీ ప్రవీణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి మొక్కలను నాటాలని సూచించారు. జరిగిన పలు తప్పిదాలపై తనకు పక్షం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులను జారీ చేస్తున్నట్లు తెలిపారు. రికార్డుల్లో ఎప్పటికప్పుడూ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, డీఆర్పీలు ముక్తయ్య, రమేశ్, రాంబాబు, వెంకన్న, ప్రతీక్, ఎంపీవో నర్సింహ, ఈజీఎస్ టీఏ సుబ్బారావు, ఈఎస్ ప్రవీణ, సర్పంచ్‌లు తులసమ్మ, అరుణ, ప్రభాకర్, రవినాయక్, వెంకట్‌రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.