కోట్పల్లి, ఏఫ్రిల్ 17 : ప్రభుత్వ బడుల్లో రూపురేఖలు మారి, త్వరలోనే సొబగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వ మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుతలో కోట్పల్లి మండలంలోని మొత్తం 9 పాఠశాలల్లో 7 ప్రాథమిక, 2 ఉన్నత పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఈ పాఠశాలల నిర్వాహణ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహించి, ప్రజల భాగస్వామ్యంతో మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేటు బడులను తలదన్నేలా సర్కార్ పాఠశాలలను తయారు చేసేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని తలపెట్టి మౌలిక సదుపాయాలను కల్పించి మంచి వాతావరణంలో నాణ్యమైన విద్యాబోధనను అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో విద్యార్థుల తల్లింద్రండులు సంతోషాలను వ్యక్తం చేస్తున్నారు.
ఎంపికైన పాఠశాలలు ఇవే..
కోట్పల్లి (ఎంపీపీఎస్), అన్నాసాగర్, బార్వాద్, మొత్కుపల్లి, ఎన్నారం, జిన్నారం, మల్శేట్పల్లి తాండా, కోట్పల్లి ( జడ్పీహెచ్ఎస్), మోత్కుపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఎంపిక చేశారు.
పాఠశాలల్లో చేపట్టనున్న పనులు..
ప్రతి పాఠశాలలో 12 రకాల పనులు చేపట్టనున్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాఠశాలలను డిస్మెటల్ చేసి నూతన భవనం కట్టించడం, బడికి ప్రహరీ, కిచెన్ షెడ్లు, ఫర్నీచర్, డిజిటల్ విద్య, గ్రీన్చాక్ బోర్డులు ఏర్పాటు, తరగతి గదుల్లో మరమ్మతులు, మరుగుదొడ్లలో నీటి వసతి, మధ్యాహ్న భోజనానికి డైనింగ్ హాల్, తాగునీటి వసతి పనులు చేపట్టనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
మన ఊరు- మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా నిర్వహిస్తాం. మొదటి విడుతలో కోట్పల్లి మండలంలో మొత్తం 9 పాఠశాలలో అందులో 7 ప్రాథమిక, 2 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులకు సంబంధించిన పనులను చేపట్టనున్నాం. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు వేగవంతం చేస్తాం.
– చంద్రప్ప, ఎంఈవో, కోట్పల్లి
మన ఊరు- మన బడి మంచి కార్యక్రమం
మన ఊరు – మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కలర్ పుల్ హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకోనున్నది. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. సీఎం కేసీఆర్ విద్యకు పునాధుల్లో ఉన్న ఇబ్బందులను పసిగట్టి మౌలిక వసతులను కల్పించి, అన్ని పాఠశాలల్లో ఇంగిష్ విద్యతో పాటు పెయింటింగ్, ఆవరణల్లో పచ్చని చెట్లతో విద్యార్థులకు చక్కటి వాతావరణాన్ని కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు నేడు ప్రైవేటును కాదని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించే విధంగా మార్పును తేవడం చాలా సంతోషకరం.
– విశ్వంపంతులు, ప్రధానోపాధ్యాయుడు, కోట్పల్లి