రంగారెడ్డి, ఏప్రిల్ 17, (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో పంట మార్పిడి దిశగా వ్యవసాయ శాఖ చర్య లు తీసుకుంటున్నది. గతేడాది తగ్గించిన పంటలను ఈ ఏడాది అధిక ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని అన్ని రైతువేదిక భవనాల్లో వానకాలం సీజన్లో ఏ పంటలను సాగు చేయాలనే దానిపై రైతులకు అవగాహన కార్యక్రమాలను కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. రాను న్న వానకాలంలో అధికంగా పత్తి, కంది, జొన్న తదితర పంటల సాగు పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాగా గతేడాది పత్తి పంట సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షా లు అదునుదాటిన తర్వాత రావడం, కూలీల కొరత సమస్యతో రైతులు పత్తికి బదులుగా ఇతర పంటలను సాగు చేశారు. అయితే దేశ, విదేశాల్లో పత్తికి డిమాండ్ ఉండటం, అధిక ధర వస్తుండటంతో ఈ ఏడాది పత్తి పంట సాగు పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత రెండేండ్ల కాలంలో జిల్లాలో పత్తి సాగును పరిశీలించగా 2020 వానకాలం సీజన్లో 2.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, 2021 వానకాలంలో 1.31 లక్షల ఎకరా ల్లో సాగైంది. మరోవైపు ఈ ఏడాది సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయనున్నారు.
పెరుగనున్న కంది సాగు..
రానున్న వానకాలంలో జిల్లాలో పత్తి సాగుతోపాటు కంది పంట సాగు పెంపుపై జిల్లా వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. కందులకు మంచి ధర ఉండటంతోపాటు రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న దృష్ట్యా రైతులు కంది పంట సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ఈ ఏడాది జిల్లా నుంచి అధిక మొత్తంలో పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేసే లా గ్రామాల్లో ప్రచారం చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని అన్ని రైతువేదికల్లో పత్తి, కంది పంటల సాగును పెంచేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కంది సాగు ను 35 వేల ఎకరాలకు పెంచేందుకు నిర్ణయించారు. గత వానకాలంలో 35వేల ఎకరాల్లో కంది పంట సాగుకాగా, ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులను సిద్ధం చేయనున్నారు.
పత్తికి మంచి డిమాండ్..
ఈ ఏడాది పత్తి సాగుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా వ్యవసాయాధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ సూచనల మేరకు రానున్న వానకాలంలో అధిక ఎకరాల్లో పత్తిని సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులు అధిక మొత్తంలో లాభాలను ఆర్జించొచ్చనే ఉద్దేశంతోనే పత్తి పంట సాగును పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పండించే పత్తికి దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉండటం, రైతులు సాగు చేసిన పత్తిని ఆయా జిల్లాల్లో ఉన్న జిన్నింగ్ మి ల్లుల ద్వారా సీసీఐ ఆధ్వర్యంలో కొంటుండటంతోపాటు మద్దతు ధర కూడా లభిస్తున్నది.
అంతేకాకుం డా గతేడాది రికార్డు స్థాయిలో పత్తికి ధర పలికింది. దీంతో జిల్లాలో పండించే పంటల్లో 60 శాతం మేర పత్తి పంట సాగయ్యేలా జిల్లా వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. గతేడాది సమయానికి వర్షాలు లేకపోవడంతో పత్తి సాగు తగ్గిందని పేర్కొంటున్నారు. పత్తిని సాగు చేసే రైతులు తప్పనిసరిగా జూన్‌లోనే విత్తనాలను వేయాల్సి ఉంటుంది, కానీ గత వానకాలంలో జూలై నెల వరకు వర్షాలు లేకపోవడం , అదునుదాటిపోవడంతో చాలావరకు రైతులు పత్తికి బదులుగా ఇతర పంటలను సాగు చేశారు. అంతేకాకుండా గత రెండేండ్లుగా పత్తిని సాగు చేసిన రైతులు అకాల వర్షాలతో నష్టపోయారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న అధికారులు ఈ వానకాలం సీజన్లో పత్తి సాగును గణనీయంగా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో పత్తిసాగును పెంచేందుకు కార్యాచరణ మొదలెట్టారు. గతేడాది జిల్లాలో 3.79 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా, 1.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది.అదేవిధంగా 2020 వానకాలంలో ఆయా పంటలు కలిపి మొత్తం 4.71 లక్షల ఎకరాల్లో సాగుకాగా, పత్తి 2.70 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. జిల్లాలోని అన్ని మండలాల్లోని నేలలు పత్తి సాగుకు అనుకూలమైనవి. దీంతో అన్ని మండలాల్లోనూ పత్తి సాగును పెంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.