రంగారెడ్డి, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలోని రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రాథమికంగా 41 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలను పెంచుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో రైతులు ఆగం కావొద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ యాసంగి వడ్లను ప్రభుత్వం కొంటుందని ప్రకటించినట్లు తెలిపారు. కాగా జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తామని తెలిపారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సబితారెడ్డి సూచించారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి రూ. 1960 మద్దతు ధరను పొందాలని సూచించారు.
అదేవిధంగా గన్నీ బ్యాగుల కొరత లేకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాన్నారు. రైతులు కొనుగోలు కేం ద్రాల వద్ద ఎదురు చూడకుండా తేదీల వారీగా రైతులకు టోకెన్లను జారీ చేసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ధాన్యాన్ని కొనాలన్నారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న వరి పంట వివరాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు ప్రణాళికలను దూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లా, మం డల స్థాయి అధికారులు సమన్వయంతో పని చేయాల ని.. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులను కల్పించాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, డీఎస్వో మనోహర్రాథోడ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్యామారాణి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీఆర్డీవో ప్రభాకర్ పాల్గొన్నారు.
అధికారులు సమష్టిగా పని చేయాలి : తిరుపతిరావు
ఈ యాసంగి సీజన్లో జిల్లాలో 47 వేల ఎకరాల్లో 41,215 మంది రైతులు వరి పంటను సాగు చేశారని, దీని ద్వారా 1.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన ధాన్యం కొనుగోలుపై మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతోపాటు కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్, రైస్‌మిల్లర్లతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధాన్యా న్ని కొనాలని, అవసరమైన గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం నాణ్యతా ప్రమాణా లు, తేమ తొలగించే అంశం, ప్యాడీ క్లీనర్ల వినియోగం తదితర అంశాలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి టోకెన్లను జారీ చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుం డా సమష్టిగా పనిచేయాలన్నారు.