రంగారెడ్డి, ఏప్రిల్ 13, (నమస్తే తెలంగాణ) : ‘రంగారెడ్డి జిల్లా పరిధిలోని 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111 జీవో ఎత్తివేతతో అభివృద్ధికి ఆటంకంగా ఉన్న
సంకెళ్లు తెంచుకున్నట్లయ్యింది.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ తీసుకున్న జీవో రద్దు నిర్ణయంతో ఆ గ్రామాల ప్రజల 25 ఏండ్ల కల సాకారమైంది..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 111 జీవో వల్ల కనీసం బోరు వేయలేని, చెక్‌డ్యాం నిర్మించలేని, శిథిలావస్థకు చేరిన ఇల్లును కూడా కట్టుకునే పరిస్థితి లేకుండా ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ జీవోను ఎత్తివేశారని, అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు దమ్ముంటే ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 111 జీవో ఎత్తివేస్తే హైదరాబాద్‌కు ఏదో జరుగుతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్‌కు 50 ఏండ్ల పాటు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నదన్నారు. వడ్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని, రైతులకు ఇబ్బందులు కలుగొద్దన్న సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ వడ్లను కొనేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. రెండు, మూడు రోజుల్లో గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని 84 గ్రామాల పరిధిలోని రైతుల కష్టాలను గుర్తించి 111 జీవో ఎత్తివేతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని తన చాంబర్లో 111 జీవో ఎత్తివేత, వడ్ల కొనుగోలుపై మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 25 ఏండ్లుగా 84 గ్రామాల ప్రజలకు గుదిబండలా మారిన 111 జీవో ఎత్తివేతతో సమస్యలు తీరనున్నాయన్నారు.
111 జీవోను అప్పట్లో అశాస్త్రీయంగా, రాజకీయ కోణంతోనే తీసుకువచ్చారని, ఎక్కడో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా అన్యాయంగా 111 జీవో పరిధిలోకి తీసుకువచ్చారని, కానీ 84 గ్రామాల ప్రజల కష్టాల తెలుసుకొని సీఎం కేసీఆర్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో చేవెళ్ల పరిధిలో పర్యటించిన అన్ని పార్టీల నేతలు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, కానీ జీవో ఎత్తివేస్తే ప్రస్తుతం ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు.
111 జీవో అమల్లో ఉండడంతో 84 గ్రామాల పరిధిలో కనీసం బోరు వేయలేని, చెక్‌డ్యాం నిర్మించలేని, శిథిలావస్థకు చేరిన ఇల్లును కూడా కట్టుకునే పరిస్థితి లేకుండా ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొన్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పనులతోపాటు, చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టిందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం, విశ్వాసంతో 84 గ్రామాల ప్రజలు ఎదురుచూశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు.
84 గ్రామాల ప్రజలు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ నేతలు ధైర్యముంటే సంబంధిత గ్రామాల ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలన్నారు. 111 జీవో ఎత్తివేస్తే హైదరాబాద్‌కు ఏదో జరుగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్‌కు 50 ఏండ్లపాటు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నదన్నారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కాళేశ్వరం నుంచి నీటిని తరలించి జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను నింపే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు.
2-3 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలుపై అధికారులతో సమావేశమై ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2-3 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతులకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 24 గంటల కరెంట్, కాళేశ్వరం ద్వారా సాగునీరు, రైతు బంధు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాలు అరికట్టడం వంటి కార్యక్రమాలతో వరి సాగు భారీగా పెరిగిందని మంత్రి అన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4-5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా, ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4-5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదన్నారు. గతంలో డ్వాక్రా గ్రూపుల ఆధ్వర్యంలో ధాన్యాన్ని సేకరించిన 4-5 నెలలకు డబ్బులు చెల్లించేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని సూచించినా, సాగు చేసిన రైతుల నుంచి మానవతాదృక్పథంతో ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించిందన్నారు. అంతేకాకుండా 2-3 రోజుల్లో చెల్లింపులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం చివరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.