షాద్నగర్టౌన్, ఏప్రిల్ 13: ప్రాణం ఎంతో విలువైందని, అలాంటి ప్రాణాలను రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా హెల్మెట్ ధరించి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ బుగ్గారెడ్డిగార్డెన్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులచే రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన ర్యాలీని సినీ నటుడు లక్ష్మీనారాయణ(టార్జన్), ప్రముఖ కళాకారుడు కొమరంతో కలిసి ప్రారంభించారు. హెల్మెట్ పెట్టుకొని విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ అందరిని ఆకట్టుకున్నది. అనంతరం బుగ్గారెడ్డిగార్డెన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యాలయంలో వారు పాల్గొని మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
హెల్మెట్ రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు, ఇతర వాహనదారులు సీట్ బెల్టును తప్పకుండా ధరించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిందడ్రులకు హెల్మెట్, సీట్ బెల్టుతో కలిగే ప్రయోజనాలను వివరించాలని, వారు తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్టును పెట్టుకునే విధంగా చూడాలన్నారు. వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ తమకు ఒక కుటుంబ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని డ్రైవింగ్ చేయాలన్నారు. ట్రాఫిక్ నియమ, నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించే అవకాశం ఉందన్నారు. వేగం కన్నా ప్రాణమే మిన్న అని వివరించారు. అందరికి అవగాహన కల్పించే విధంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించిన రఘుకుమార్ తెలంగాణ బుక్ఆఫ్ రికార్డును అందుకున్నారు.