పరిగి, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలోని పాఠశాలల్లో త్వరలో పనులను ప్రారంభించేందుకు విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాలలు 764, ప్రాథమికోన్నత పాఠశాలలు 116, ఉన్నత పాఠశాలలు 174 ఉన్నాయి. ఇందులో భాగంగా అత్యధిక విద్యార్థులు గల 371 పాఠశాలలను మొదటి విడుత కింద ఎంపిక చేశారు. వాటిలో 12 అంశాలకు సంబంధించిన సదుపాయాలు కల్పించనున్నారు. ఎంపికైన పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు సంబంధించి అంచనాలు తయారు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. నిధుల విడుదలకు సంబంధించి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిపించారు. ఇప్పటికే జిల్లాకు రూ.2కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. విడుతలవారీగా నిధుల విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అంచనాలు తయారై ఇంజినీరింగ్ అధికారుల ఆమోదం, ఎంవోయూ, రిజల్యూషన్‌ను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపించిన అనంతరం ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్‌ను జిల్లా కలెక్టర్ జారీ చేస్తారు. అనంతరం పనులు ప్రారంభమవుతాయి.
జిల్లాలోని బొంరాస్‌పేట్ మండలంలో 14 పాఠశాలలకు సంబంధించి 48 పనులకు రూ.26985849, ధారూరులోని 6 పాఠశాలల్లో 20 పనులకు రూ.11047053, దోమలోని ఒక పాఠశాలలో ఒక పనికి రూ.97105, కొడంగల్‌లోని 8 పాఠశాలల్లో 26 పనులకు రూ.21600459, కోట్‌పల్లిలోని 5 పాఠశాలల్లో 16 పనులకు రూ.9043674, కులకచర్లలోని 2 పాఠశాలల్లో 7 పనులకు రూ.2511585, మర్పల్లిలోని 4 పాఠశాలల్లో 15 పనులకు రూ.7083254, మోమిన్‌పేట్‌లోని 4 పాఠశాలల్లో 13 పనులకు రూ.3456639, పెద్దేముల్ మండలంలోని 6 పాఠశాలల్లో 17 పనులకు రూ.2839829, తాండూరులోని 2 పాఠశాలల్లో 11 పనులకు రూ.3525025, వికారాబాద్‌లోని 4 పాఠశాలల్లో 18 పనులకు రూ.13680260 అవసరమవుతాయని ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు తయారు చేశారు.
మిగతా మండలాల్లోనూ ఒకటి రెండు రోజుల్లో కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన నివేదికలు తయారుచేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా ప్రతి పాఠశాలలో చేపట్టనున్న పనులన్నీ కలిపి ప్రాజెక్టుగా నిధుల అంచనాలు తయారుచేసి పనులు చేయిస్తారు. ఇప్పటివరకు 38 ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంతోపాటు డిప్యూటీ ఈఈ ద్వారా 4 ప్రాజెక్టులు అప్రూవల్ కూడా పూర్తయింది. జిల్లాలో 11 పాఠశాలల్లో పనులకు సంబంధించిన పరిపాలన అనుమతులు, 15 పాఠశాలలకు సంబంధించి సాంకేతిక అనుమతులు మంజూరు చేశారు.
త్వరలో పనులు ప్రారంభం
వికారాబాద్ జిల్లా పరిధిలో త్వరలో మంత్రి సబితారెడ్డి పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన అంచనాలు రూపొందించి ఫండ్ రిలీజ్ ఆర్డర్లు పూర్తిచేసేలా అధికారులు పనిచేస్తున్నారు. ఎంపికైన పాఠశాలల్లో నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, మంచినీటి వసతి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్, పాఠశాల భవానానికి పెయింటింగ్, మైనర్, మేజర్ రిపేర్లు, గ్రీన్‌చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీలు, కిచెన్షెడ్లు, అవసరమైనచోట అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాల్ల నిర్మాణం, డిజిటల్ విద్య అమలుకు అవసరమైన సదుపాయాలు కల్పించనున్నారు.
పనుల నిర్వహణకు అంచనాలు
– రేణుకాదేవి, జిల్లా విద్యా శాఖ అధికారి
మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పనులను చేపట్టేందుకు అవసరమైన అంచనాలు రూపొందిస్తున్నారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు తయారుచేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించిన విధంగా పనులు చేపట్టేందుకు అనుమతులు తీసుకోవడానికి అవసరమైన చర్యలు వేగంగా చేపడుతున్నాం. జిల్లాలో మొదటి విడుతలో 371 పాఠశాలలు ఎంపికవ్వగా అన్ని పాఠశాలల్లో పనులకు సంబంధించిన అంచనాలు రూపొందించిన తర్వాత జిల్లా కలెక్టర్ ఫండ్ రిలీజ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఆ తర్వాతే పనులు ప్రారంభమవుతాయి.