అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 9 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామంలో కొండపై కొలువైన కోదండ రామచంద్రస్వామి ఆలయం మినీ భద్రాచలంగా పేరొచ్చింది. ఎత్తైన కొండ గుట్టల పైన వెలసిన సీతారామ, లక్ష్మణ, హనుమంత దేవతా మూర్తులను చూసి తరించని భక్తులు ఉండరు. అతిపూరాతన ప్రదేశమైన ఈ దేవాలయంలో యేటా శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే మూహూర్త సమయానికి ఇక్కడ కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయానికి దాదాపు 460 ఏండ్ల చరిత్ర ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. హైదరాబాద్ నగరానికి 25 కి.మీ దూరంలో ఉంటుంది. కోదండ రాముడిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాల్లో అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్ మండలాలతో పాటు సమీపంలోని ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, సరూర్నగర్, మంచాల, యాచారం మండలాల నుంచే కాకుండా యాదాద్రి జిల్లా చౌటుప్పల్, పోచంపల్లి తదితర మండలాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.
భద్రాచలం సమయానికే కవాడిపల్లిలో కల్యాణం
భద్రాచంలో జరిగే మహోత్సవ సమయానికే ఇక్కడ కూడా సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సువిశాలమైన కల్యాణ మండపంలో సీతారామచంద్ర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. మండల తహసీల్దార్ హాజరై అధికార లాంఛనాలతో పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, నాయకులు, భక్తులు వేలాదిగా పాల్గొంటారు.
ప్రారంభమైన ఉత్సవాలు..
కవాడిపల్లిలో కోదండరామచంద్ర స్వామి కల్యాణ రథోత్సవాలు ప్రారంభమయ్యాయని సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్, ఉత్సవ కమిటీ చైర్మన్ రాసాల రాముయాదవ్ తెలిపారు. 10న ఉదయం 9 గంటలకు అంకురార్పణ, పంచసుక్తాభిషేకం, ధ్వజారోహణ, సాయంత్రం 6 గంటలకు సుందర విశాల కల్యాణ వేధికపై కోదండ రామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం, రాత్రి రామభక్త సమాజం బండ్లగూడ కేశవగిరి భక్తబృందంచే హనుమంత సేవపై స్వామి వారి ఊరేగింపు, 11న ఉదయం లక్ష్మీసహస్రనామార్చన, మహానివేదన, రాత్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా, మిమిక్రీ బొడిగె రమేశ్గౌడ్చే నిర్వహించనున్నట్లు తెలిపారు. కీ.శే తోర్పునూరి కాశయ్యగౌడ్ సరూర్నగర్ వారి కుటుంబ సభ్యులతో మహాయజ్ఞాలు, సీతారాముల రథోత్సవం, ప్రత్యక్ష లంకాదహనం, 12న చక్ర తీర్థం, అపభృతస్నానం, ఆంజనేయ సహస్రనామార్చన, గరుడసేవ, దోపోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు.