ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కృపేశ్
ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 7 : ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కృపేశ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్, ఉపాధి హామీ, ఎక్సైజ్, ఆర్టీసీ, ఐకేపీ, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ శాఖలతో పాటు ఇతర శాఖలపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రతి ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున గ్రామాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో అక్కడక్కడ విద్యుత్ సమస్యలు నేటికీ తీరడం లేదని.. వెంటనే విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా అధికారులు కృషిచేయాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీల్లో పెరుగుతున్న వివిధ రకాల మొక్కలు వర్షాకాలం నాటికి సిద్ధమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ మొక్కలకు నీరు అందించడంతోపాటు నీడ సౌకర్యం కల్పించాలన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. గతంలో వేసవికాలం వచ్చిందంటే ప్రజలు తాగునీటి కోసం బోరుబావుల వద్దకు పరుగులు తీసేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ నల్లానీరు అందించి తాగునీటి సమస్యలు తలెత్తకుండా చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటప్రతాప్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్, సీడీపీవో సృజన, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌లఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.