టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్
బొం0రాస్పేట, ఏప్రిల్ 7: క్షయ వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని, వచ్చే 2025 నాటికి దేశంలో టీబీని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం, క్షయ వ్యాధి నియంత్రణపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీబీతో ప్రతి ఏడాది ఎంతోమంది మరణిస్తున్నారని, ప్రజల్లో ఆ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు.
రెండు వారాలకు మించి దగ్గు, తెమడ, సాయంత్రం జ్వరం రావడం, ఆకలి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులను సరఫరా చేయడంతోపాటు ప్రతినెలా పౌష్టికాహారం తీసుకునేందుకు రూ.500 పంపిణీ చేస్తున్నదని వివరించారు. అనంతరం ఆయన టీబీ నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థుల తో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యుడు గోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, సూపర్వైజర్ మణిమాల, హెచ్ఎం పాపిరెడ్డి, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.