ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 4 : కేంద్ర ప్రభుత్వం తీరుమారి తెలంగాణలో పండించిన వరిధాన్యం కొనుగోలుచేసే వరకు తెలంగాణాలో జరిగే నిరసన జ్వాలలతో ఢిల్లీకి సెగ తగలాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఆరు రోజుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు.
తెలంగాణపై ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని.. దీనికి నిదర్శనం వడ్లు కొనుగోలు చేయబోమని కరాఖండిగా చెప్పడమేనని అన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ సస్యశ్యామలంగా ఉండి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారన్నారు. ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున వరిసాగు కావడంతో ధాన్యం దిగుమతులు పెరిగాయని అన్నారు. పెరిగిన ధాన్యం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కొనుగోలు చేయబోమని చెప్పడంవల్ల రైతులకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని.. అప్పటివరకు పోరాటం ఆపేది లేదన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాములు, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్‌కుమార్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, సహకార సంఘం చైర్మన్లు, ఉద్యమ నాయకుడు చంద్రప్రకాశ్, టీఆర్ఎస్ ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్, నాయకులు పాల్గొన్నారు.
యాచారంలో…
యాచారంలో టీఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సాగర్ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాషా, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళా నాయకులు, కార్యకర్తలున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో..
రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ముత్యంరెడ్డి, సత్తయ్య, మండల శాఖ అధ్యక్షుడు కిషన్‌గౌడ్, పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విఠల్‌రెడ్డి, చక్రవర్తి తదితరుల ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంచాలలో..
మంచాలలోని బస్టాండు సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని, అప్పటి వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీఆర్ఎస్ నేతలు అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు రమేశ్, బహదూర్, సహకార సంఘం అధ్యక్షుడు పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీటీసీలు, నాయకులున్నారు.
ధాన్యం కొనేవరకు నిరసనలు తప్పవు..
షాద్‌నగర్, ఏప్రిల్ 4 : రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలుచేసే వరకు నిరసనలు తప్పవని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హెచ్చరించారు. సోమవారం షాద్‌నగర్, కొత్తూరులలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంపై కక్షను పెంచుకొని ఉద్దేశపూర్వకంగా లేనిపోని కిరికిరీలు పెడుతూ ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం బాధాకరమన్నారు.
యాసంగిలో పండే వరి పంట వాతావరణం కారణంగా నూక అయ్యే అవకాశం ఉంటుందని, అందుకే బాయిల్డ్ రైస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కేంద్రం వద్ద నాలుగు, ఐదేండ్లకు సరిపడ బియ్యం ఉన్నాయని చెప్పడం గర్హనీయమన్నారు. బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వారే చెప్పాలని విమర్శించారు. షాద్‌నగర్ పట్టణ ముఖ్యకూడలిలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. కేశంపేట, చౌదరిగూడ మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నందిగామ, కొందుర్గు మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించి నిరసనలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, జడ్పీటీసీలు, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులున్నారు.
రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రం
ఆమనగల్లు, ఏప్రిల్ 4 : యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తల తోకలేని మాటలు మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచుతున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహించారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమనగల్లులోని హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసనకు దిగారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండల కేంద్రాల్లో నిర్వహించిన దీక్షల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు.
పెద్దఎత్తున రైతులు, నాయకులు తరలివచ్చారు. ఈ నెల 11 వరకు తలపెట్టిన నిరసన దీక్షల్లో టీఆర్ఎస్ నాయకులు, రైతులు విధిగా పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తోటగిరియాదవ్, జడ్పీటీసీ అనురాధ, ఎంపీటీసీ సరిత, కౌన్సిలర్ రాధమ్మ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, నాయకులు పాల్గొన్నారు. కడ్తాల్ మండలం నుంచి పార్టీ మండల అధ్యక్షుడు పరమేశ్, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వీరయ్య, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, డైరెక్టర్ లాయక్‌అలీ, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం నుంచి పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌యాదవ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు దశరథ్‌నాయక్, ఏఎంసీచైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్‌రెడ్డి, సర్పంచులు, నాయకులు, డైరెక్టర్ శేఖర్ పాల్గొన్నారు. మాడ్గుల మండలం నుంచి పార్టీ మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ తిరుమల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శంకర్‌నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రవితేజ, సర్పంచులు, మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
కొనేదాక పోరాటాలు ఆగవు
షాబాద్, ఏప్రిల్ 4 : తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనేదాక పోరాటాలు ఆపేది లేదని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు తేల్చి చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం చేవెళ్ల నియోజకవర్గవ్యాప్తంగా షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు రహదారులపై ధర్నాలకు దిగారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ.. అన్నదాతలకు అండగా నిలుస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఇతర రాష్ర్టాల రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొన్నట్లుగా తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. కేంద్ర వైఖరికి నిరసనగా ఈ నెల 11 వరకు అన్ని మండలాలు, గ్రామాల్లో నిరసన దీక్షలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు అవినాశ్‌రెడ్డి, మాలతి, శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు ప్రశాంతిరెడ్డి, విజయలక్ష్మి, నక్షత్రం, గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.