రంగారెడ్డి, ఏప్రిల్ 4, (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, పంచాయతీ వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సోమవారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీ వార్డులు, మున్సిపాలిటీ వార్డు లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఏప్రిల్ 21 నాటికి ఓటరు జాబితాను వార్డుల వారీగా సిద్ధం చేయాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని, బ్యాలెట్ పత్రాలు, తదితర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 339 వార్డులు, సర్పంచ్ స్థానాలు-9, ఎంపీటీసీ స్థానాలు-5తోపాటు బండ్లగూడ జాగీర్ పరిధిలోని కౌన్సిలర్ స్థానం ఖాళీగా ఉందని, ఆ స్థానాల్లో ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.