రంగారెడ్డి, జూన్ 29,(నమస్తే తెలంగాణ): ఏడో విడుత తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది నాటాల్సిన మొక్కలకు సంబంధించి అంతా సిద్ధం చేశారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకుగాను నర్సరీల్లో సిద్ధంగా ఉంచారు. రేపటి నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభంకానున్నది. జిల్లాలో ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లా అంతటా మొక్కలు నాటేందుకుగాను గుంతలు తీసే ప్రక్రియ కూడా జోరందుకుంది. అయితే ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)కు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. నాటిన ప్రతి మొక్కనూ బ్రతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. గుంతలను తీసే ప్రక్రియ నుంచి నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ చేయనున్నారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా గ్రామాల రూపురేఖలను మార్చి, స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకుగాను మరోసారి ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
జిల్లాలో సరిపోను మొక్కలు…
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 74 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే జిల్లాలోని 558 నర్సరీలతోపాటు అటవీ శాఖ నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. జిల్లాలోని 558 నర్సరీల్లో 66 లక్షల మొక్కలను పెంచుతుండగా, ప్రస్తుతం నాటేందుకుగాను 53 లక్షల మొక్కలు సిద్ధంగా ఉండగా, మిగతా మొక్కలు అటవీ శాఖ నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 4.29 లక్షల గుంతలు తీసే ప్రక్రియ పూర్తయింది. జిల్లావ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలకు ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున తులసీ, దానిమ్మ, జామ, మునగ, గులాబీ, మల్లె మొక్కలను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో రోడ్లకు ఇరువైపులా 2.67 లక్షల మొక్కలను నాటనున్నారు. అదేవిధంగా ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో 7 లక్షలు, విద్యాశాఖ 75 వేలు, డీఆర్డీవో ఆధ్వర్యంలో 30 లక్షల మొక్కలు, డీపీవో ఆధ్వర్యంలో 5 లక్షలు, నీటిపారుదల శాఖ 10 వేలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్(సరూర్నగర్) ఆధ్వర్యంలో 50 వేలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్(శంషాబాద్) ఆధ్వర్యంలో 50 వేలు, వ్యవసాయ శాఖ 3 లక్షలు, డీఎంహెచ్వో ఆధ్వర్యంలో 10 వేలు, పరిశ్రమల శాఖ 2 లక్షలు, ఉద్యానవన శాఖ లక్ష, దేవాదాయ శాఖ 10 వేలు, సాంఘిక సంక్షేమ శాఖ 10 వేలు, గిరిజన సంక్షేమ శాఖ 5 వేలు, గనుల శాఖ 25 వేలు, మార్కెటింగ్ శాఖ 10వేలు, పౌరసరఫరాల శాఖ 5వేల మొక్కలను నాటనున్నారు. అదేవిధంగా 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో 23.50 లక్షల మొక్కలను నాటనున్నారు. అయితే ఈ ఏడాది ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఏయే మొక్కలను నాటాలనే దానిపై చేసిన తీర్మానం ప్రకారం సంబంధిత మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామ పంచాయతీలో 10 వేల మొక్కలను నాటనున్నారు.
10 రోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి
రేపటి నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని చేపట్టనున్నారు. ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను మరోసారి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో చేపట్టే పనులకుగాను జిల్లా కలెక్టర్కు రూ.కోటి, మంత్రులకు రూ.2 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కూలిపోయిన ఇండ్లను కూల్చడం, భవన శిథిలాలను తొలగించడం, నిరూపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేయడం, గ్రామాల్లో సర్కార్ తుమ్మ, జిల్లెడు వంటి కలుపు మొక్కలు, పెంట కుప్పలను తొలిగించడం, రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయడం, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలిగించడం, తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడం వంటి పనులను చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నెలకు రూ.12.38 కోట్లు, పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలకు రూ.5.60 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది.
జిల్లాలో సరిపోను మొక్కలు
హరితహారంలో భాగంగా నాటేందుకుగాను జిల్లాలో సరిపోను మొక్కలు అందుబాటులో ఉన్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా జిల్లాలోని 558 నర్సరీలతోపాటు అటవీ శాఖ నర్సరీల్లో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రతీ మొక్కను సంరక్షించేందుకుగాను చర్యలు చేపడుతున్నామని, గుంత తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే వరకు ప్రక్రియ నంతా జియోట్యాగింగ్ చేయనున్నామన్నారు.