కొందుర్గు, ఏప్రిల్ 2 : గ్రామాల్లోని పేద రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా మామిడి మొక్కలను సరఫరా చేస్తున్నారు. ఐదు ఎకరాల లోపు భూమి వున్న ప్రతి రైతుకు మామిడి మొక్కలు పంపిణీ చేసి మూడు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందజేస్తున్నది. మామిడి తోటల పెంపకంపై ఆసక్తి వున్న రైతులు తమ పొలాల్లో ప్రభుత్వం ద్వారా అందజేసిన మొక్కలను పెంచుతున్నారు. ఈ పథకంలో తోటలు పెట్టుకున్న రైతులు సంవత్సరానికి కొంత ఆదాయాన్ని పొందుతున్నారు. మామిడి మొక్కలు ఉచితంగా అందజేయడంతో పాటు మొక్కలు పెట్టేందుకు గుంతలు కూడా ఉచితంగానే తీయడం వల్ల రైతులకు మామిడి తోటలు పెంచేందుకు ఎలాంటి డబ్బులు ఖర్చు కావడం లేదు. పైగా నిర్వహణ ఖర్చులు ఇవ్వడంతో ఎక్కువ మంది మామిడి తోటలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అర్హులందరికీ మొక్కల సరఫరా
మామిడి తోటలు పెంచుకునేందుకు అర్హులైన వారందరికీ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు ఏపీవో నర్సింగరావు తెలిపారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శుల వద్ద ధరఖాస్తు చేసుకుంటే మొక్కలకు గుంతలు తీయడం, మొక్కల సరఫరా, నిర్వహణ ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదనలు మండల అధికారులకు పంపుతారు. ఎకరానికి 70మామిడి మొక్కలను ప్రభుత్వం అందజేస్తున్నది. మొక్కలు నాటిప్పటి నుంచి ఒక్కో మొక్కకు నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ.15 అందజేస్తుంది. అంటే ఒక ఎకరా మామిడి తోట పెట్టుకుంటే నెలకు రూ.1050లు ప్రభుత్వం అందజేస్తున్నది. మొక్కలను సురక్షితంగా సంరక్షించుకుంటే ఇలా మూడు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందజేస్తుంది. దీనితో పాటు మామిడి మొక్కలకు వేసే ఎరువుల ఖర్చులు కూడా అందజేస్తారు. ప్రతి ఒక్క రైతుకు ఐదు ఎకరాల వరకు మామిడి తోటలు పెట్టుకునే అవకాశం వుంది.
మంచి ఆదాయం వస్తుంది
ఉపాధి హామీలో పెంచుకున్న మామిడి తోట వల్ల నాకు ప్రతి సంవత్సరం మామిడి కాయల ధరను బట్టి రూ.15వేల నుంచి 25వేల వరకు వస్తున్నది. నేను ఒక ఎకరంలో మామిడి తోట పెట్టాను. ప్రభుత్వం నుంచి ఉచితంగా మొక్కలు సరఫరా చేశారు.
-సాయన్న, రైతు పెద్ద ఎల్కిచర్ల గ్రామం, జిల్లెడ్చౌదరిగూడ మండలం
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి
నేను ఉపాధి హామీ పథకం ద్వారా రెండు ఎకరాల్లో మామిడి తోటను పెట్టాను. ప్రతి సంవత్సరం రూ.25వేల నుంచి 50వేల వరకు ఆదాయం వస్తున్నది. దీంతో మాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతున్నాయి. ప్రభుత్వం ఉచితంగా మామిడి మొక్కలు, నిర్వహణ ఖర్చులు అందజేయడం అభినందనీయం.
– కృష్ణయ్య, రైతు , గాలిగూడ గ్రామం, జిల్లెడు చౌదరిగూడ మండలం