షాబాద్/షాద్నగర్ టౌన్/బొంరాస్పేట, ఏప్రిల్ 1 : ఉగాది పండుగ తెలుగు వారికి చాలా ప్రత్యేకం. చైత్రశద్ధ పాడ్యమి రోజున వచ్చే ఉగాదినే నూతన సంవత్సరంగా పాటించడం ఆనవాయితీ. నేడు ప్లవనామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శుభకృత్నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ ఉగాదిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ర్టాలలో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. శుభకృత్ అంటే శుభాన్ని చేసి పెట్టేది అని అర్థం. ఉగాది పండుగ రోజున ప్రతి ఇల్లు పచ్చని మామిడి తోరణాలతో కళకళలాడుతుంది. ఉదయాన్నే తమ ఇష్టదైవాలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. షడ్రుచులతో కూడిన పచ్చడిని తయారు చేసి దేవుళ్లకు నైవేద్యంగా పెడుతారు. దేవాలయాల వద్దకు వెళ్లి పంచాంగ పఠనాన్ని వింటారు.
ఉగాది పర్వదిన విశిష్టత ఇలా
ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది. యుగాది అంటే సంవత్సరంలో మొదటి రోజు అని అర్థం. ఈ మొదటి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. ఉ అంటే నక్షత్రం అని, గా అంటే గమనం అని నక్షత్రాన్ని, గమనాన్ని ప్రారంభించే రోజును ఉగాది పర్వదినంగా నిర్వహించుకుంటున్నాం. ఉగాది పచ్చడికి ప్రత్యేకత ఉంది. షడ్రుచులు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరుతో తయారు చేసేదే పచ్చడి. ముఖ్యంగా షడ్రుచులు తీపి-సంతోషానికి, చేదు -బాధకు, కారం-కోపానికి, ఉప్పు-భయానికి, పులుపు- చిరాకుకు, వగరు-ఆశ్యర్యానికి గుర్తుగా భావిస్తారు. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద గ్రంథాలను దొంగలించి వాటిని సముద్ర గర్భంలో దాస్తాడు. ఆ సమయంలో మహావిష్ణువు మత్స్యవతారంలో ఆ రాక్షసుడి సంహరించి దొంగలించిన గ్రంథాలను బ్రహ్మకు ఇస్తాడు. ఆ గ్రంథాలతో బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుగా కూడా చెప్పవచ్చని పూరాణాలు చెబుతున్నాయని వేద పండితులు చెబుతున్నారు.
మరో కథనం..
ఉగాది పండుగ రోజున అంటే చైత్రశుక్ల పాడ్యమి రోజున భూలోకం ప్రారంభమైందని శాస్ర్తాల్లో ఉన్నట్లు పండితులు చెబుతుండగా, బ్రహ్మదేవుడు అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజునే సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. వేదాలను హరించిన సోమకుడిని శ్రీమహా విష్ణువు మత్స్యావతారం ఎత్తి సంహరించి ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఈ సందర్భంగానే ఉగాదిని నిర్వహించుకుంటున్నామని పురాణాల్లో ఉన్నది. నేడు నిర్వహించుకునే శుభకృత్నామ సంవత్సరం 36వది. ఈ 60 తెలుగు సంవత్సరాలకు ఉన్న పేర్లకు కూడా పురాణ కథనం ఉన్నది. బ్రహ్మ మానస పుత్రుడు నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి రాజును పెళ్లాడుతాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మిస్తారు. ఆ రాజు తన 60 మంది సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే ఆ యుద్ధంలో 60 మంది మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు కరుణించి నీ పిల్లలు 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతుంటారని వరమిచ్చాడని చెబుతారు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పౌరాణిక కథనం.
ఉగాది పండుగ రోజు పాటించే ఆచారాలు
ఉగాది పండుగను తెలుగు లోగిళ్లలో సంప్రదాయంగా జరుపుకుంటారు. ఇండ్లకు సున్నాలు, రంగులు వేసి శుభ్రం చేసుకుంటారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రజలు కర్నాటకలోని బీదర్లో, లక్ష్మీనరసింహస్వామిని ఇంటి దేవునిగా కొలుస్తారు. ఇండ్లను శుభ్రం చేసుకోవడంతో నరసింహస్వామికి జల్ది ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పండుగ రోజు గుమ్మాలకు మామిడాకులతో తోరణాలను కడుతారు. వీటిని కట్టడం వల్ల క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ తోరణాలు శ్రీరామ నవమి వరకు పరిశుభ్రంగా ఉండడంతో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండదని నమ్మకం. ఇక ఉగాది పండుగ రోజున షడ్రుచుల పచ్చడి ప్రత్యేకం. దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి. బెల్లం, వేపపువ్వు, కొత్త చింతపండు పులుపు, ఉప్పు, పచ్చి మామిడి ముక్కలు, కారంతో తయారు చేసిన పచ్చడిని సేవిస్తారు.
వీటిలో ఒక్కోదాని వల్ల ఒక్కో ప్రయోజనం ఉంటుంది. దేవాలయాల ఎదుట చలువ పందిళ్లు వేస్తారు. ప్రజలు కొత్త బట్టలు ధరించి దేవాలయాలను సందర్శించి పోలెలు, పచ్చడిని నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం సమయంలో దేవాలయాల ఆవరణల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. కొత్త ఏడాది అంతా తమ పేర్ల మీద జాతకాలు ఎలా ఉంటాయి, వానకాలం ఎలా ఉంటుంది, పంటలు బాగా ఉండుతాయా లేదా పండితులను అడిగి తెలుసుకుంటారు. జిల్లాలోని పలు ఆలయాల్లో ఇప్పటికే పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో పలు రకాల ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు. కరోనాతో రెండేండ్లు ఉగాది ఉత్సవాలు ఇండ్లకే పరిమితం కాగా, ఈసారి ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకునేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావాసులు సిద్ధమవుతున్నారు.
ఏరువాకకు రైతులు సిద్ధమయ్యే వేళ..
నేడు శుభకృత్ నామ ఉగాది పండుగ. నూతన వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్నారు. చైత్ర శుక్ల పాడ్యమినే ఉగాది పండుగగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. వసంత రుతువును తానే అని గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ అన్నాడు. నిజంగానే ఈ రుతువు పరమాత్ముడికి ప్రతినిధి. ఏడాది పొడుగునా వచ్చే ఆరు రుతువుల్లో మొదటి రుతువు వసంతమేనని వేదాలు చెబుతున్నాయి. ఆకులను రాల్చి మోడులైన వృక్ష లతాదులు వసంత రుతువులోనే మళ్లీ చిగురించి నూతన శోభతో కళకళలాడుతాయి. రైతన్నలు నాగండ్లకు పూజలు చేసి పొలంలో ఏరువాక సాగుతారు. ఏడాది పొడవునా తమ కుటుంబమంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవనం సాగాలని, పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. ఉగాదికి ఒకటి, రెండు రోజుల ముందు చెరుకు, బెల్లం, కందమాలం, పసుపుకొమ్మలు, మోకులు, పల్పులు, ములకర్ర తదితర సామగ్రి కొనుగోలు చేసుకుంటారు. కర్రనాగలిని కొత్తది తయారు చేస్తారు. లేదా పాతనాగలిని శుభ్రం చేస్తారు.
ఉగాది రోజు వేకువజామున ఏరుపూసేందుకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటారు. ఉగాది రోజున నాగలితో పొలంలో ఏరుపూయడం ఆనవాయితీ. గ్రామానికి చెందిన పురోహితులు ఏ కర్రతో తయారు చేసిన నాగలి వాడాలి, ఏ దిశగా ఏరు పూయాలన్నది వివరిస్తారు. పశువులశాలలో ఉన్న ఏడ్లకు పసుపురాసి కొత్త మోకు పల్పులు, ములకర్ర, పంచామృతం, కొబ్బరికాయ వంటి సామగ్రితో పొలానికి వెళ్లి ఏరుపూత పనులు చేపడుతారు. ఇండ్లల్లో గృహిణులు ముందుగా తయారు చేసిన పిండివంటలను ఏరుపూత అనంతరం రైతు ఇంటికి రాగానే అందిస్తారు. ఆ తరువాత వేపపువ్వు, మామిడికాయలను తమ తమ ఇండ్లకు అందజేస్తారు. అ తరువాత గ్రామంలోని దేవాలయం వద్ద నిర్వహించే పంచాంగశ్రవణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఇండ్లల్లో తయారు చేసిన ఉగాది పచ్చడిని తాగుతారు. ఆర్థిక పరిపుష్టి గలవారు ఉగాది రోజున కొత్త వస్తువులు, వాహనాలు, బంగారం తదితర వాటిని కొనుగోలు చేస్తారు.
పంచాంగ శ్రవణంతో ఎన్నో విషయాలు తెలుస్తాయి..
ఉగాది పర్వదినం రోజున చెప్పే పంచాంగ శ్రవణంతో ఈ సంవత్సరంలో జరిగే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో పాడిపంటలు పుష్కలంగా పండి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి. దైవానుగ్రహంతో అంతా మంచే జరగాలి. నవ నాయకుల స్థితిగతులను బట్టి ఫలితాలను నిర్ణయించవచ్చు. సంవత్సరంలో జరగబోయే విషయాలు, ఫలితాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు.
– రవిశర్మ, బ్రహ్మణ సేవాసమాఖ్య అధ్యక్షుడు షాద్నగర్