యాచారం, ఏప్రిల్ 01 : టీఎస్-బీపాస్ విధానం ద్వారా భవనాలు, లేఅవుట్ల అనుమతులు సౌకర్యవంతంగా, సులభంగా పొందవచ్చని పంచాయతీ రాజ్ కమిషనర్ జాన్‌వెస్లీ అన్నారు. మండలంలోని గున్గల్ గ్రామంలో టీఎస్-బీపాస్ పై పంచాయతీ కార్యదర్శులకు, అధికారులకు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. టీఎస్, బీపాస్ ద్వారా నూతనంగా నిర్మించే ఇంటి అనుమతులు, లేఅవుట్ల అనుమతులు ఎలా ఇవ్వాలి. ఎన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఇవ్వాలి. ఎంత విస్తీర్ణానికి ఎంత మొత్తాన్ని చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేయడం ఎలా అనే పలు అంశాలపై పంచాయతీ అధికారులకు పూర్తి స్థాయిలో ప్రయోగాత్మకంగా ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ కమిషనర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. టీఎస్ బీపాస్ పోర్టల్ (http:/tsbpass. telangana.gov.in) ద్వారా మీసేవలో దరఖాస్తు చేస్తుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ టీఎస్-బీపాస్‌ను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. టీఎస్-బీపాస్ ద్వారా భవన నిర్మాణాలు ఎలాంటి ఇబ్బందులు, అవకతవకలు లేకుండా చిటికెలో అయిపోనున్నట్లు తెలిపారు. భూ యజమానులకు, ప్రాపర్టీ బిల్డర్లకు భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికే ప్రభుత్వం ఈ విధానం అమలు చేసిందన్నారు.
600 చదరపు గజాల లోపు ఉండే ఇండ్ల నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకున్న వెంటనే భవన నిర్మాణ అనుమతులు లభిస్తాయన్నారు. 600 చదరపు గజాల కంటే ఎక్కువగా ఉన్న నివాస, నివాసేతర భవనాలకు 21 రోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి పరిశీలన తరువాత అనుమతులను ఇవ్వనున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వెంటనే కూల్చి వేస్తామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న నివాస, నివాసేతర ఇండ్లకు, భవనాలకు, లే-అవుట్లకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. లేదంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మండలంలో టీఎస్-బీపాస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, మండల పంచాయతీ అధికారి శ్రీలత, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు