ఏకాగ్రతతో చదివితే విజయం ఖాయం..
గ్రూప్ స్టడీస్తో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చంటున్న నిపుణులు
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 30 : పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పదోతరగతి పరీక్షలు.. పాఠశాలల్లో హడావిడి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు, స్లిప్టెస్ట్లతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. అన్నింటిని మించి తల్లిదండ్రులకు మరింత ఒత్తిడి పెంచింది. మే చివరి వారంలో పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. దీంతో అందరి దృష్టి పరీక్షల వైపు పడింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు బోధన కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఈ మాత్రం చదువులు కొనసాగించాల్సిందేనని భావనతో ముందుకెళ్తున్నారు.
పరీక్షల్లో ప్రతిభను చూపాలనే తపన విద్యార్థుల్లో ఉండాలి. చదువుతున్న సబ్జెక్టుపై పూర్తిస్థాయి పట్టు సాధించాలి. ప్రాథమిక అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించినట్లయితే విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురికారు. ఆందోళన చెందకుండా విషయాలపై పట్టు సాధించేందుకు ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలి. ఎంత సమయం చదివామన్నది కాకుండా ఎంత శ్రద్ధతో చదువుతున్నామని గ్రహించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెన్నుతట్టి ప్రోత్సహించాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్పుడే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నారు.
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం..
మండలంలోని అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ఆయా పాఠశాలల్లో ఉదయం. సాయంత్రం వేళల్లో తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా సబ్జెక్టుల వారిగా బోధిస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణత, మంచి గ్రేడ్లు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.
– వెంకట్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంఈవో
గ్రూపులుగా చదివిస్తున్నాం..
పదో తరగతి విద్యార్థులను గ్రూపులుగా ఏర్పాటు చేసి చదివిస్తున్నాం. ప్రతి ఏటా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షల సమయంలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా ఒత్తిడికి గురికాకుండా ప్రత్యేక సలహాలు, సూచనలు అందిస్తున్నాం.
– ఝాన్సీ, ప్రధానోపాధ్యాయురాలు, ఇబ్రహీంపట్నం బాలికల ఉన్నత పాఠశాల