అన్నీ తానై పెంచిన అమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది.. అయినవాళ్లెవరూ లేరు.. ఉన్నవాళ్లెవరూ తెలియదు.. అమ్మరాదని పూర్తిగా అర్థంచేసుకోలేని చెల్లికి అన్నీ తానై చూసుకోవాల్సిన అక్న.. అక్న కన్నీరు పెడుతుంటే అమాయకంగా చూస్తున్న చెల్లి.. షాద్నగర్లో మంగళవారం కనిపించిన దృశ్యం ఇది..
షాద్నగర్, ఫిబ్రవరి 15: ఫాతిమా అనే మహిళ గత కొన్నాళ్లుగా షాద్నగర్ కూరగాయాల మార్కెట్, గంజ్ ప్రాంతంలో ఉంటూ చిన్నాచితక పనులు చేస్తూ తన ఇద్దరు చిన్నారులను పోషిస్తుండేది. ఈమధ్య ఫాతిమా అనారోగ్యానికి గురికావడంతో స్థానిక సర్కారు దవాఖానకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నది. ఫాతిమా ఆరో గ్యం మరింత క్షిణించి మంగళవారం ఉదయం సర్కారు దవాఖానలోనే మరణించింది. దీంతో ఆమె కూతుళ్లు ఆసియా, రేష్మ మృతదేహం వద్ద ఏమి తెలియనట్లు కూర్చున్న తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఆలనాపాలనా చూడాల్సిన అమ్మ మృతిచెందడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫాతిమాది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతమని, మిగతా వివరాలు తెలియవని స్థానికులు తెలిపారు.