ఆమనగల్లు, మార్చి 25 : యాసంగి వరి ధాన్యాన్ని కొనేదాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కొట్లాడుదామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని చింతలకొండరెడ్డి గార్డెన్లో వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరి పై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం, అసంపూర్తి కాల్వల పూర్తి, మిషన్ కాకతీయ పథకాల వల్ల చెరువులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. దీంతో రైతాంగం అంతా వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మళ్లినట్లు చెప్పారు. వరి పంట పండించడంలో మొదటి స్థానం దక్కించుకున్న ఘనత రాష్ర్టానికి దక్కిందన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. ఈ విషమయై పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రులు రాష్ట్ర రైతాంగం తరఫున పీఎం, కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసినా కేంద్రం వైఖరి మారడం లేదన్నారు. దేశంలో ఆహార పంటల విషయంలో ఒకే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వారికి అనుకూలమైన రాష్ర్టాలకు ఒక విధంగా, అనుకూలంగా లేని రాష్ర్టాల పట్ల కేంద్రం వివక్షత చూపుతున్నదన్నారు. తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తూ కేంద్ర మంత్రి పీయూష్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేలా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆదేశాను సారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అదేవిధంగా గిరిజనులంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జంగ్ సైరన్ మోగించాలని కోరారు. అంతకు ముందు ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు రైతుల సమస్యల గురించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు భరత్‌ప్రసాద్, దశరథ్‌నాయక్, విజితారెడ్డి, అనురాధ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ సత్యం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు బాలయ్య, శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్లు తోటగిరియాదవ్, విజయ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్, భాస్కర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అర్జున్‌రావు, శంకర్, పరమేశ్, జైపాల్‌రెడ్డి, భూపతిరెడ్డి పాల్గొన్నారు.