కొడంగల్, మార్చి 25: కొలిచిన వారికి కొంగుబంగారంగా వెలుగొందుతున్న మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ 42వ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అర్చకులు, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి తొమ్మిది రోజు లపాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. తిరుపతికి వెళ్లలేని భక్తులు కొడంగల్‌లోని ఈ దేవదేవుడిని దర్శించుకుంటే తిరుమలేషుడిని దర్శించుకున్నంత భాగ్యాన్ని పొందుతారని ఇక్కడి ప్రజల నమ్మకం. గత 40 ఏండ్లుగా స్వామి వారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించే కీ.శే. సుందరావరద భట్టాచార్యుల చేతుల మీదుగా జరిగేవి. కాగా ఆయన మరణించిన తర్వాత భట్టాచార్యుల వంశానికే చెందిన వారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీవారు భక్తుల మొర ఆలకించేందుకు, వారిని అనుగ్రహించేందుకే కొడంగల్ పట్టణంలో వెలిశారని పట్టణ ప్రజల విశ్వాసం. తిరుపతికి వెళ్లలేని భక్తులు కొడంగల్ శ్రీనివాసుడిని దర్శించుకొని ఆ తన్మయత్వాన్ని పొందుతుంటారు. విగ్రహమూర్తి రూపం, పూజా విధా నం తిరుమల ఆలయాన్ని పోలి ఉండటంతో కొడంగల్‌లోని మహాలక్ష్మీవేంకటేశ్వరుడి ఆల యం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ ఆల య నిర్మాణం పూర్తై 52 ఏండ్లు కావొస్తున్నది.
ముఖద్వారం నుంచే..
ఆలయ ముఖద్వారం నుంచే తిరుమల తిరుపతి శోభ, తేజస్సు ఉట్టిపడుతుంది. ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా జయవిజయ ద్వార పాలకులు ఆగ్నేయంలో వకుళమాళికాదేవి, నవగ్రహాలు, నాగశేషుడు, వినాయకుడు అచ్చం ఆ తిరుమలను తలపిస్తుంది. అలాగే స్వామివారికి అద్దాల మేడ, పుష్కరిణి, ధ్వజస్తంభం, తీర్థప్రసాదాల గది, క్షౌరశాల, కల్యాణ మండపం స్వామి వారి విగ్రహమూర్తిని ఊరేగించేందుకు వివిధ రకాల ఉత్సవ వాహనాలూ అందుబాటులో ఉన్నాయి.
28 నుంచి ప్రారంభం
మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రతిఏటా ఫాల్గుణ మాసం లో తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. స్వామివారి అలంకరణ, కైంకర్యాలలో తిరుమల తిరుపతి ఆలయానికి చెందిన అర్చకులే పాల్గొనడం ఈ బ్రహ్మోత్సవాల విశిష్ఠత. ప్రతిరోజూ స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి వేర్వేరు వాహనాల్లో వీధుల్లో ఊరేగిస్తుంటారు. ధ్వజారోహణంతో ప్రారంభమ య్యే ఉత్సవాలు చక్రస్నానం, ధ్వజారోహణంతో ముగిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ సాయంత్రం నిర్వహించే ఉయ్యాలసేవను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఉయ్యాలసేవలో భాగంగా ప్రతిరో జూ బాలాజీ పాడుతా తీయగా అనే పాటల పోటీని నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆయా పాఠశాలలకు చెందిన చిన్నారులు పాల్గొని నృత్య ప్రదర్శనలు ఇస్తారు. బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకు న్నది. తిరుమలలోని ఆ దేవదేవుడు ధరించే శేష వస్ర్తాన్ని టీటీడీ వారు స్వయంగా స్వామి వారికి సమర్పిస్తారు. ఆ తిరుమలేషుడే ఇక్కడ కొలువుదీరినట్లుగా భక్తులు భావించి భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటారు. అదే రోజు జాతర మైదానంలో ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతగా నిలిచిన ఎద్దులకు వెండి పతకాలను అందిస్తారు. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు స్థానిక భక్తులే కాకుండా ఇతర మండలాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి తరిస్తారు.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
ఆలయాన్ని నిర్మించి దాదాపుగా 52 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఈ సారి నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ ధర్మకర్తలు పెద్ద ఎత్తున ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆలయ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. స్వామివారు కొలువుదీరే వాహనాలకు కొత్త మెరుపులు దిద్దుతున్నారు. ఆలయ ప్రాంగణం చుట్టూ మండపాల ఏర్పాటు, పట్టణ ప్రధాన కూడళ్లలో తోరణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వసతులను కల్పిస్తామని ఆలయ ధర్మకర్తలు తెలిపారు.
ప్రతిరోజూ ఓ ప్రత్యేకత
తొమ్మిది రోజులపాటు జరిగే ఆలయ బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ నెల 27న తిరుమంజనం, ఈ నెల 28న సేనాధిపతి ఉత్సవం, ఈ నెల 29న ధ్వజారోహణం, ఈ నెల 30న చిన్న శేషవాహనం, ఈ నెల 31న సింహవాహనం, ఏప్రిల్ 1న కల్పవృక్ష వాహనం, 2న మోహిని అవతారోత్సవం, ఉగాది పర్వదినం, పంచాంగ శ్రవణం, 3న హనుమంత, వసంతోత్సవం, 4న సూర్యప్రభ వాహనం, 5న రథోత్సవం, ఏప్రిల్ 6న పల్లకీసేవ ఉత్సవం, చక్రస్నానంతో ఉత్సవాలు ము గుస్తాయి. ప్రతిరోజూ ఒక్కో ఉత్సవంలో స్వా మి వారు కొలువుదీరి ఉదయం, రాత్రి సమయాల్లో ఊరేగింపుగా జాతర స్థలానికి బయలు దేరి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. గరుడోత్సవం రోజున తిరుమల తిరుమలేశుడు ధరించిన శేషవస్ర్తాలను టీటీడీ వారు అందిస్తారు. ఆ శేష వస్త్ర అలంకరణలో స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతుండగా భక్తులు దర్శించుకుని తన్మయత్వాన్ని పొందుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్వామివారికి అభిషే కం, రాత్రి 7నుంచి 9 గంటల వరకు ఊంజల్ మండలంలో ఉయ్యాలసేవ, ఈ సందర్భంగా బాలాజీ పాడుతా తీయగా కార్యక్రమంలో భాగంగా చిన్నారుల నృత్యప్రదర్శన తదితర కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 9-11 గం టల వరకు భజన కార్యక్రమం ఉంటుంది.