బొంరాస్‌పేట, మార్చి 22: గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న పేద గిరిజన రైతులకు అండగా నిలిచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గిరి వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చింది. సాగు నీటి వసతి లేక బీడుగా ఉన్న గిరిజనుల భూములను సాగులోకి తీసుకురావడంతోపాటు వారికి అవసరమైన మౌలిక వసతులను ఈ పథకం ద్వారా అధికారులు కల్పిస్తారు. నీటి వసతి లేని సన్న, చిన్నకారు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. ఐదు ఎకరాలకు ఒక బోర్వెల్ యూజర్ గ్రూపును ఏర్పాటు చేసి ఆ గ్రూపులోని రైతుల భూముల సాగుకు వందశాతం రాయితీతో బోరు వేసి విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఈ పథకం క్రింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు మండలాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మండలంలో ఇప్పటికే జడ్పీటీసీ, అధికారులు రైతులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన ఇందిర జలప్రభ పథకం సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో దాని స్థానంలో సీఎం కేసీఆర్ గిరి వికాసం పథకాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. మండలంలో భూగర్భ జలాలు తక్కువ స్థాయిలో ఉన్న తొమ్మిది గ్రామాలు మినహా అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
లబ్ధిదారుల ఎంపిక ఇలా..
సీఎం గిరి వికాసం పథకం లబ్ధిదారులను మండలస్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, ట్రాన్స్‌కో, ఉపాధి హామీ అధికారులు ఎంపిక చేస్తారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు గిరిజన రైతులు కనీసం ఇద్దరు ఒక గ్రూపుగా ఏర్పడాలి. వారి భూములు పక్కపక్కనే ఉండాలి. ఇద్దరి కంటే ఎక్కువ మంది రైతులున్నా వారి మొత్తం భూమి ఐదు ఎకరాలకు మించరాదు. ఐదు ఎకరాలకు ఒక యూజర్ గ్రూపును అధికారులు ఏర్పాటు చేస్తారు. రైతులు ఉపాధిహామీ జాబ్‌కార్డు కలిగి ఉండాలి. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఐదు ఎకరాలకు ఒక గ్రూపును ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా బోర్వెల్ యూజర్ గ్రూపులను ఏర్పాటు చేసి జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తారు. జిల్లా అధికారులు వాటిని పరిశీలించి బోర్వెల్ యూజర్ గ్రూపుల్లో బోర్లు వేసేందుకు భూగర్భ శాఖ ఇంజినీర్లతో కలిసి తనిఖీలు చేపట్టి వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉచితంగా బోర్లు వేస్తారు. బోర్లు వేసిన తర్వాత ఆ భూముల్లో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి, బోరు మోటరును అందజేస్తారు. ఈ విధంగా ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు, విద్యుత్ సౌకర్యం కలుగుతుంది. సదరు బోర్వెల్ యూ జర్ గ్రూపుల్లోని రైతులు బోరు నీటిని సమానంగా వాడుకుంటామని ఉపాధి హామీ అధికారులకు ఒప్పంద పత్రం రాసివ్వాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు పట్టాదారు పాసు పుస్తకం, 1-బి, జాబ్‌కార్డు జిరాక్సు, ఆధార్‌కార్డు, ఒప్పందం కోసం రూ.100 బాండ్ పేపర్, గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాల్సి ఉంటుంది.
150 దరఖాస్తులు వచ్చాయి
గిరిజన రైతులకు సీఎం గిరి వికా సం పథకం ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. జిల్లాలోని బొంరాస్‌పేట, కొడంగల్, కులకచర్ల, పెద్దేముల్ వంటి మండలాల రైతుల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 150 వరకు దరఖాస్తులు అందాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసు కునేందుకు చివరి తేదీ అంటూ ఏమీలేదు. ఎంతమంది రైతుల నుంచి దరఖాస్తులు వచ్చినా తీసుకుంటాం. గిరివికాసం పథకంపై ఎంపీడీవోలు, ప్రజా ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తే ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాస్థాయిలో జరిగే సమావేశాల్లోనూ ఎంపీడీవోలకు ఈ విషయంపై ఆదేశిస్తున్నాం.
– కృష్ణన్, డీఆర్డీవో వికారాబాద్ జిల్లా
గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి
నీటి వసతి లేని గిరిజన రైతుల భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సీఎం గిరి వికాసం పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకాన్ని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే రైతులకు మండల కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గిరిజన రైతులను ప్రోత్సహించాలి.
-చౌహాన్ అరుణాదేశు, బొంరాస్‌పేట జడ్పీటీసీ